గత ఏడాది ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఇటీవల రాయలసీమ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు విడుదల చేసిన పంట నష్టపరిహారం రైతుల్లో హర్షాతిరేకాలను రేపుతోంది. గత ఏడాది రాయలసీమలో పుష్కలమైన వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరగని స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది సీమలోని పలు ప్రాంతాల్లో. చెరువులు నిండుకుండలుగా మారాయి. వాగులూ, వంకలు వరద నీటితో పోటెత్తాయి.
గత ఏడాది కురిసిన భారీ వర్షాల ఫలితంగా.. ఈ ఏడాది మండు వేసవిలో కూడా వాగుల్లో నీరు పారాయంటే ఆశ్చర్యం కలగకమానదు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కూడా వంకల్లో నీరు పారుతూ కనిపించాయి. ఏడాదికి రెండు మూడు రోజుల పాటు నీరు పారడమే గగనం అనుకున్న వంకల్లో హాట్ సమ్మర్లో కూడా నీరు పారేంత స్థాయిలో నీటి ఊట ఏర్పడింది.
వంకలకు ఆనుకుని ఉన్న చెరువుల్లో నీళ్లు నిండుకుండలను తలపించే రీతిలో ఉండటంతో… వంకల్లో నీటి ఊటలు ఏర్పడి పారాయి. ఇదంతా సానుకూలమైన అంశమే. గత ఏడాది కురిసిన వర్షాలతో భూ గర్భ జలాల స్థాయి కూడా బాగా పెరిగింది. దీంతో రబీలో పంట సాగుకు భారీ ఎత్తున జరగింది. భూగర్భజలాల స్థాయి పెరగడంతో బోర్లు, బావుల్లో జలకళ సంతరించుకుంది. ఇలాంటి నేపథ్యంలో.. కొత్తగా వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. కరువుతో ఇక ఏమైపోతుందో అనుకున్న సీమ ఇలా జలకళతో సస్యశ్యామలంగా మారింది.
అయితే.. ఇంత సానుకూల పరిణామాల్లో కూడా గత ఏడాది ఖరీఫ్ రైతులకు జరిగిన నష్టం మాత్రం తేలికైనది కాదు. భారీ వర్షాల ఫలితంగా కొన్ని పంటలకు చాలా నష్టం జరిగింది. ఆగకుండా కురిసిన వర్షాలతో పలు పంటలు చేతి వరకూ వచ్చి పోగా, మరి కొన్ని పంటలు పెట్టినవి పెట్టినట్టే పోయాయి. ఇలాంటి రైతులకు కాస్త ఆలస్యంగా అయినా.. సరిగ్గా మళ్లీ ఖరీఫ్ లో పంట పెట్టుబడులు అవసరం అవుతున్న దశలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిహారాలను అందిస్తోంది. ఈ పరిహార పంపిణీ కార్యక్రమం కోసం వైఎస్ జగన్ సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లి అక్కడే లాంచనంగా రైతులకు పంట నష్టపరిహారాలను అందించారు.
గత ఏడాది బాగా నష్టపోయిన రైతుల్లో పత్తి సాగు చేసిన వారు ఉన్నారు. భారీ వర్షాల ఫలితంగా పత్తి పంటకు కోలుకోలేని నష్టం జరిగింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది. అలా సాగు చేసి గత ఏడాది నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భారీ స్థాయిలో పరిహారాన్ని అందించింది. అన్ని పంటలు సాగు చేసిన వారిలోనూ నష్టపోయిన వారు ఉన్నప్పటికీ.. పత్తి సాగు చేసి నష్టపోయిన వారికి మాత్రం ప్రభుత్వం మెరుగైన సాయాన్ని అందించింది. కొందరు పత్తి రైతులు అయితే.. లక్షల రూపాయల మొత్తంలో ఇప్పుడు పరిహారాన్ని పొందడం గమనార్హం.
అలాగే కంది రైతులకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని జగన్ ప్రభుత్వం పరిహారంగా అందించింది. చీనీ రైతులకు కూడా మెరుగైన స్థాయిలోనే పంట నష్టపరిహారం అందుతోంది. సరిగ్గా ఖరీఫ్ లో మరోసారి పెట్టుబడులకు సిద్ధం అవుతున్న తరుణంలో జగన్ ప్రభుత్వం అందిస్తున్న పరిహారం కచ్చితంగా రైతులకు వెన్నుదన్నుగా నిలిచేదే.
అయితే ఈ పరిహారంలో వేరుశనగ రైతులను మాత్రం ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. గత ఏడాది నష్టపోయిన వారిలో వేరుశనగ రైతులు కూడా ఉన్నారు. వారికి మాత్రం ఎకరానికి రెండు వేల రూపాయల మొత్తాన్ని మాత్రమే పరిహారంగా ప్రకటించారు. కొంత వరకూ ఇది అసంతృప్తికి గురిచేసే అంశమే. స్థూలంగా గత ఏడాది కురిసిన వర్షాల ఫలితంగా ఎంతో మేలు జరిగినా, కొంత నష్టం కూడా జరిగింది. ఆ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మెరుగైన స్థాయిలోనే పరిహారం అందించింది.
ఇక రాయలసీమలో ఈ సారి కూడా వర్షపాతం పరిస్థితి సానుకూలంగా కనిపిస్తోంది. జూన్ రెండో వారానికే చెప్పుకోదగిన స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది చాలా చోట్ల. దీంతో ఆశావహ పరిస్థితుల్లో రైతులు మరోసారి సాగుకు సన్నద్ధం అవుతున్నారు ఉత్సాహంగా!