మోడీని ఉక్కు నిరసనలు తప్పవా…?

కేంద్రంలో బలమైన ప్రభుత్వంగా ఉన్న బీజేపీ తన విధానం ఇదేనని చాటుకుంటూ కొన్ని నిర్ణయాలను గట్టిగానే అమలు చేస్తోంది. అందులో చెప్పుకోవాల్సింది విశాఖ ఉక్కుని బలవంతగా ప్రైవేట్ పరం చేయాలనుకోవడం. ఆ దిశగా చాలానే చేస్తూ…

కేంద్రంలో బలమైన ప్రభుత్వంగా ఉన్న బీజేపీ తన విధానం ఇదేనని చాటుకుంటూ కొన్ని నిర్ణయాలను గట్టిగానే అమలు చేస్తోంది. అందులో చెప్పుకోవాల్సింది విశాఖ ఉక్కుని బలవంతగా ప్రైవేట్ పరం చేయాలనుకోవడం. ఆ దిశగా చాలానే చేస్తూ జోరు చూపిస్తోంది. ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా కేంద్రం తగ్గడంలేదు.

ఇక ప్రధాని వద్దకు వెళ్ళి తమ మొర చెప్పుకోవాలని ఉక్కు ఉద్యమకారులు ఎంత ఆరాటపడినా అనుమతి అయితే లేదు. అలాంటిది మోడీ సార్ స్వయంగా విశాఖ రానున్నారు. ఆయన జూలై  4న అల్లూరి 125వ జయంతి వేడుకలలో భాగంగా విశాఖ రావడం జరుగుతోంది.

దీంతో మోడీ ముందే తమ నిరసనలు తెలియచేడానికి ఉక్కు కార్మిక సంఘాలు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 26 నాటికి విశాఖ ఉక్కు ఉద్యమానికి 500 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా విశాఖలో మహా ప్రదర్శన నిర్వహించబోతున్నారు.

ఈ ప్రదర్శన కేంద్రానికి గట్టిగా తెలిసేలా ఉంటుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా విశాఖ వస్తున్న ప్రధాని మోడీకి తన ఆవేదనను తెలియచెప్పేలా ఈ ఉద్యమం ఉంటుంది అని అంటున్నారు. ఈ నెల 26న జరిగే ప్రదర్శనలో ఉక్కు ఉద్యోగులు, కార్మికులతో పాటు వారి కుటుంబాలు కూడా పాలు పంచుకుంటాయని అంటున్నారు. ఇన్నాళ్ళూ జరిగిన ఉద్యమం ఒక ఎత్తు ఈ మహా ప్రదర్శన ఒక ఎత్తు అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు.

ఇక విశాఖ ప్రధాని మోడీ రాక సందర్భంగా ఉక్కు కార్మికులు తమ బాధను గోడుని వెళ్ళబోసుకుంటారని, విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయవద్దు అని విన్నవించుకుంటారు అని అంటున్నారు. విశాఖ టూర్ లో మోడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏమైనా పెదవి విప్పుతారా లేదా అన్నది కూడా చూడాలి.