కేంద్రం ప్రకటించిన అగ్ని పధ్ పధకం కాదు కానీ ఆర్మీలో చేయాలనుకున్న యువత అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. పర్మనెంట్ జాబ్స్ గా సైన్యంలో ఉంటాయనుకుంటే కేవలం నాలుగేళ్లకే పరిమితమా అని గుస్సా అవుతున్నారు. దీంతో ఉత్తరాదిన మొదలైన ఆందోళనలు కాస్తా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం దాకా కధ సాగింది.
ఈ నేపధ్యంలో విశాఖ రైల్వే స్టేషన్ మీద ఆందోళనకారుల కన్ను పడింది అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో విశాఖ రైల్వే స్టేషన్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి రైల్వే పోలీసులతో పాటు ఏపీ పోలీసులు తీసుకున్నారు.
రైల్వే స్టేషన్ వైపు ఎవరూ రాకుండా జాగ్రత్తపడుతున్నారు. విశాఖను మొత్తం జల్లెడ పడుతున్నారు. అనుమానం వస్తే చాలు ప్రత్యేక తనిఖీలు చేపడతున్నారు. అలాగే విశాఖలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడంతో అక్కడ పూర్తి స్థాయి భద్రతను పెంచారు.
అన్ని రకాలుగా అప్రమత్తంగా పోలీసులు ఉంటూనే ఏ క్షణంలో ఏం జరిగినా తగిన యాక్షన్ ప్లాన్ తో దిగాలని కూడా రెడీ అయిపోయారు. విశాఖలో రైల్వే స్టేషన్ మీద దాడి జరగవచ్చు అన్న సమాచారం తమ వద్ద ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో అంతటా అలెర్ట్ ప్రకటించి మరీ బందోబస్తు పెంచారు.