టీఎన్ శేషన్ భారత ఎన్నికల ముఖ్య అధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే…మన దేశంలో ఎన్నికల సంఘం అంటూ ఒకటుందని, దానికి విశేషమైన అధికారాలున్నాయని తెలిసొచ్చింది. ఎందుకంటే టీఎన్ శేషన్ మాత్రమే ఎన్నికల సంఘం విశేష అధికారాలను సక్రమంగా వినియోగించి…ప్రజలకు స్వేచ్ఛాయుత ఓటు హక్కు కల్పించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు…టీఎన్ శేషన్ అంత కాకపోయినా , ఆ ఒరవడిని కొనసాగించారని చెప్పవచ్చు.
తాజాగా చెన్నై ఐఐటీతో వాళ్లతో కలిసి భారత ఎన్నికల సంఘం మరో అద్భుతమైన , విప్లవాత్మక మార్పునకు పరిశోధన చేస్తోంది. అదేంటంటే ఓటరు ఎక్కడున్నా తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఆన్‌లైన్‌లో ఓటింగ్ ప్రక్రియపై పరిశోధన చేస్తున్నట్టు ఇటీవల భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజంగా ఇది కార్యరూపం దాలిస్తే మాత్రం అత్యున్నత భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.
ఇప్పటికే ఈవీఎంల వాడకంతో రిగ్గింగ్‌ను బాగా అరికట్టకలిగారు. ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడం చాలా సర్వసాధారణ విషయంగా ఉండేది. దానికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియలోకి తీసుకొచ్చారు.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు పాలకపక్షంపై ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నాయి. అదేంటంటే అసలు ప్రతిపక్ష సభ్యుల నామినేషన్లను అడ్డుకుంటోందని, నామినేషన్ పత్రాలను చించివేస్తూ దౌర్జన్యాలకు తెగపడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కూడా ఎన్నికల సంఘం దృష్టి పెట్టాల్సి వుంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. వ్యవస్థలను మనం సంరక్షించుకుంటే…అవి ప్రజలను అన్ని వేళలా కాపాడుతాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పెడితే…భారత ఎన్నికల వ్యవస్థలోనే ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.
ఇప్పుడు ఎలాంటి పరీక్షలైనా, బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించారు. అలాగే ఉద్యోగాలకు సైతం ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకునే విధానం దేశ వ్యాప్తంగా ఉంది. అంతేకాకుండా హాల్ టికెట్లను కూడా నేరుగా ఆన్‌లైన్‌లో డౌన్ లోడ్ చేసుకునే సులభ విధానం మన వ్యవస్థలో ఉంది.
అలాంటప్పుడు దౌర్జన్యకారుల ఆగడాలను అరికట్టడానికి ఆన్‌లైన్‌లో నామినేషన్ విధానాన్ని ఎందుకు చేపట్టకూడదు. ఈ దిశగా ఎన్నికల సంఘం ఎందుకు సీరియస్‌గా ఆలోచించకూడదు? ఎన్నో సంస్కరణలకు పెట్టింది పేరైన మన ఎన్నికల సంఘం…అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఆలోచించాల్సిన తక్షణం అవసరం ఎంతైనా ఉంది.