ఒక దశలో ఫామ్ కోల్పోయి, తన పెన్నులో ఇంక్ అయిపోయిందని అనిపించుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. 'ఆనంద్'తో అదరగొట్టి, ఆ తర్వాత 'హ్యాపీడేస్' తో యువతకు బాగా చేరువైన శేఖర్, లీడర్ తో సోసో అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మాత్రం శేఖర్ గ్రాఫ్ ను తగ్గించి వేసింది. హ్యాపీడేస్ ఫార్ములాతో తీసిన ఆ సినిమాకు బదులుగా, శేఖర్ హ్యాపిడేస్ ను మరో భాషలో రీమేక్ చేయాల్సిందని క్రిటిక్స్ వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత కహానీని రీమేక్ చేసి శేఖర్ మరో పరాజయం పొందారు. ఇక శేఖర్ చేసేది లేదేమో అనే అభిప్రాయాలు గట్టిగా వినిపించాయి. కాస్త బ్రేక్ తీసుకుని, ఫిదాతో వచ్చి క్రిటిక్స్ అంచనాలను తలకిందుల చేశాడు ఈ దర్శకుడు. మరి ఇప్పుడేం చేస్తాడనేది ఆసక్తిదాయకంగా మారింది.
లవ్ స్టోరీ అంటూ వస్తున్న శేఖర్ కొత్త అనుభూతిని ఇస్తాడా లేక, మళ్లీ తన హిట్ ఫార్ములానే రిపీట్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తాడా? అనేది త్వరలో తేలిపోనుంది. హ్యాపీడేస్ మూడ్ లోకి వెళ్లిపోయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేసినట్టుగా, ఫిదా మూడ్ లో మరోసారి ఫిదా చేయాలని చూస్తే కష్టమే. అలా కాకుండా లవ్ స్టోరీ అనే చాలా పాత, రొటీన్ టైటిల్ తో కొత్తదనాన్ని పంచితే మాత్రం పసందే!