దేనికైనా ‘మూడ్’ అనేది ఇంపార్టెంట్. మంచి మూడ్‌లో ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక కళాకారులకైతే అన్నిటికంటే మూడ్ అనేది ఎంతో ముఖ్యమైంది. కేవలం మంచి ‘మూడ్’ కోసమే సినీ దర్శకులు ఊటీ, కోడైకెనాల్, విశాఖ బీచ్…ఇలా దేశవిదేశాల్లోని సుందరమైన పర్యాటక ప్రాంతాలకు వెళ్లి కొన్నిరోజుల పాటు గడిపి వస్తారు. తమతో పాటు రచయితలను వెంట తీసుకెళ్లి అద్భుతమైన సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటుంటారు. ఇవన్నీ చాలా సర్వసాధారణ విషయాలు.
బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ కూడా మంచి మూడ్‌లో ఉన్నారు. దీనికి కారణం ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘థప్పడ్’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఘన విజయం సాధించడమే. తాప్సీ నటన కెవ్వు కేక అనిపించిందని పేరు తెచ్చుకొంది. బాలీవుడ్ ప్రముఖులంతా తాప్సీపై ప్రశంసలు కురిపిస్తుండటంతో ఆమెలో జోష్ నింపింది.
దీంతో తాప్సీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. తాజాగా ఆమె చీరలో ఉన్న ఫొటోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదండోయ్…తన ఫీలింగ్స్‌ను సుదీర్ఘ కామెంట్స్‌తో వ్యక్తపరిచారు. నిజంగా ఈ కామెంట్స్ చదివితే మాత్రం అబ్బో తాప్సీ మహాకవయిత్రి అయిపోయిందే అని ప్రశంసలు కురిపిస్తారు. ఇంతకూ ఆమె కామెంట్స్ ఏమిటో తెలుసుకుందాం.
‘నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే చీకటిని జయించాను. నేను నిరాడంబరంగా ఉన్నాను. ఎందుకంటే.. నేను నిరాశను ఎదుర్కొన్నాను. బలవంతురాలిని.. ఎందుకంటే పరిస్థితులు నన్ను అలా మార్చాయి. కృతజ్ఞతతో ఉన్నాను… ఎందుకంటే నష్టాన్ని తెలుసుకున్నాను. ఇక నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను’ అంటూ స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
ప్రస్తుతం కామెంట్స్‌తో కూడిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ పోస్టుకు 4 లక్షల లైక్స్ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక తాప్సీ పోస్టు చూసిన నెటిజన్లు బాలీవుడ్ నటినటులు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. తాప్సీ తాజా చిత్రం ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హా..‘నువ్వు స్మార్ట్ అయ్యావు తాప్సీ’ అంటూ కామెంట్ చేశాడంటే ఆయన ఎంతగా ఫిదా అయ్యాడో తెలిసిపోతోంది. ఇలా ఒకరేమిటి…అనేక మంది ప్రముఖులను ఆమె ఫొటో, కామెంట్స్‌కు అభిమానులుగా తయారయ్యారంటే అతిశయోక్తి కాదు.