యువదర్శకుడు తరుణ్ భాస్కర్ టీవీ హోస్టుగా మారబోతూ ఉన్నారు. పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా ప్రత్యేకతను చూపించి, మరోవైపు నటుడుగా కూడా ప్రయత్నం చేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు టీవీ షో మొదలుపెడుతూ ఉండటం గమనార్హం. టీవీ షోలో దర్శకులను ఇంటర్వ్యూ చేస్తాడట ఈ దర్శక, నటుడు. ఈ షోకు కూడా ఆసక్తిదాయకమైన పేరును ఫిక్స్ చేశారు. 'నీకు మాత్రమే చెప్తా' అని. ఈ మధ్యనే తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించగా విడుదల అయిన సినిమా పేరుకు స్వల్ప మార్పు ఇది.
ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పలువురు దర్శకులతో ఇంటర్వ్యూలు కూడా చేశారట. ఈ శనివారం నుంచినే ఒక చానల్ ఈ షో ప్రారంభం కాబోతోందని సమాచారం. దర్శకులతో మాట్లాడి.. వారు వివిధ సినిమాల సందర్భాల్లో ఎదుర్కొన్న అనుభవాలను ఇందులో వివరింపజేయనున్నారట. ఒకవైపు యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఎక్కువైపోయాయి. అనేక మంది ప్రముఖ దర్శకులతో గంటలగంటల ఇంటర్వ్యూలు నెట్ లో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు టీవీ హోస్టుగా ఈ దర్శకుడు, వేరే దర్శకులతో కొత్తగా ఏం చెప్పిస్తాడో చూడాల్సి ఉంది.
తను ఇలా టీవీ హోస్టుగా మారినా, దర్శకత్వ బాధ్యతల్లో కొనసాగుతానంటూ, వెంకటేష్ హీరోగా తన దర్శకత్వంలో ప్రతిపాదనలో ఉన్న సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందని తరుణ్ భాస్కర్ చెబుతున్నాడు.