ఒక్కోసారి ఒక్కో వేవ్ వీస్తుంటుంది టాలీవుడ్ లో. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాటలు హల్ చల్ చేస్తున్నాయి. తమ సినిమాలో ఒకటైనా సిద్ శ్రీరామ్ పాట వుండాలని కోరుకుంటున్నారు హీరోలు, నిర్మాతలు కూడా. దీనికి కాస్త అదనంగా ఖర్చు అయినా, సినిమాకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని ధైర్యం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే హీరో అఖిల్ 'బ్యాచులర్' కోసం పాడిన పాట వచ్చింది. హీరో రాజ్ తరుణ్ సినిమా ఒరేయ్ బుజ్జిగా కోసం పాడిన పాట ఇప్పడు వచ్చింది. కిట్టు విస్సా ప్రగడ రాసిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ మెలోడీ స్వరాలు అందించారు.
''…ఓ వాలువాలు నీ కన్నులే..ఇవ్వాళ నన్ను చూడగా మనసే జారేలా వుంది కొత్తగా వుంది ఇదేదో హాయిగా..స్వంత వీధులో దారులే ఏకంగా గుర్తు రాకనే అదేదో మైకంలో దారితప్పి నీ ప్రేమలో పడేసి నట్లుగా…
అంటూ సాగిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ మంచి స్వరాలు అందించారు. 'ఈ మాయ పేరేమిటో? ఏమిటో..ఈ మాయ పేరేమిటో..అనే హుక్ లైన్ బాగుంది. పాటకు అందిన విజువల్స్ కూడా బాగున్నాయి.
అంతా బాగానే వుంది. కానీ పాటను కాస్త మరింత మంచిగా రాయించుకోవాల్సింది. మీటర్ చూసుకున్నారు. ఆ మీటర్ కోసం పదాలను ఇష్టం వచ్చినట్లు విరిచేసారు. అందులో ఆరంభంలో పల్లవి లేదా తొలి చరణంలో పదాలను విరిచేయడం మరీ కృతకంగా వుంది.
అయితే ఈ రోజుల్లో ఇవన్నీ పట్టించుకునే జనం లేరు. అంతలా చూసి, రాసే రచయితలు తక్కువగా వున్నారు. ఇదే పాట సీనియర్లు ఎవరైనా రాసి వుంటే వేరేగా వుండేదేమో?
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత రాధామోహన్. దర్శకుడు కొండా విజయ్ కుమార్.