బసవతారకం బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్ వస్తోంది. ఇది ఎన్టీఆర్ జీవిత కథగా ఇప్పటిదాకా వినిపిస్తూ వచ్చింది. మహానటి అనే సినిమా వచ్చింది. అది నటి సావిత్రి జీవితకథ. సావిత్రి చిన్నతనం నుంచి చనిపోయే వరకు సాగేకథ. అయితే…

ఎన్టీఆర్ బయోపిక్ వస్తోంది. ఇది ఎన్టీఆర్ జీవిత కథగా ఇప్పటిదాకా వినిపిస్తూ వచ్చింది. మహానటి అనే సినిమా వచ్చింది. అది నటి సావిత్రి జీవితకథ. సావిత్రి చిన్నతనం నుంచి చనిపోయే వరకు సాగేకథ. అయితే ఇప్పుడిప్పుడే బయోపిక్ సూత్రధారి, కథానాయకుడు, నిర్మాత బాలకృష్ణ పలు ఇంటర్వూల్లో మాట్లాడిన మాటలు బయటకు వస్తున్నాయి. ఆయన తను నిర్మిస్తున్న బయోపిక్ కథాంశం గురించి నిజాలే వెల్లడిస్తున్నారు అనుకుంటే, ఈ బయోపిక్, ఎన్టీఆర్ బయోపిక్ నా? ఆయన సతీమణి బసవతారకం బయోపిక్ నా? అన్న అనుమానం కలుగుతోంది.

బయోపిక్ కథాంశం గురించి బాలకృష్ణ వివరిస్తూ, ఎన్టీఆర్ యంగ్ ఏజ్ నుంచి అధికారంలోకి వచ్చిన తరువాత నాదెండ్ల వెన్నుపోటు, ఆపై పోరుసాగించి మళ్లీ అధికారం చేపట్టడం, ఆపైన ఆయన భార్య శివైక్యం పొందడం వరకు మాత్రమే కథ వుంటుందని బాలయ్య వెల్లడించారు. ''ఇది మా అమ్మను దృష్టిలో వచ్చే నాన్నగారి జీవితకథ' అని బాలయ్య వెల్లడించారు. అందుకే ఆగస్టు సంక్షోభం తరువాత ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం, ఆ తరువాత తల్లి శివైక్యం పొందడం వరకే వుంటుందన్నారు.

సాధారణంగా ఎన్టీఆర్ లైఫ్ స్టోరీ అంటే ఆయన చిన్నతనం నుంచి మరణం వరకు వుండాలి. కానీ నాదెండ్ల ఎపిసోడ్ అనంతరంతో ఆపేయడం అంటే ఏమనుకోవాలి? నిజానికి బయోపిక్ ను ఇక్కడితో ఆపేయడం మామూలుగా అయితే అభ్యంతరం కాదు. కానీ ఎన్టీఆర్ జీవితంలో రెండు కీలక ఘట్టాలు ఈ తరువాతే వున్నాయి. ఒకటి కుటుంబ సభ్యులు అందరూ ఒక్కటై ఆయన పార్టీని, అధికారాన్ని లాక్కోవడం. రెండు ఆయన జీవితంలో రెండో పెళ్లి చేసుకోవడం.

ఈ రెండూ కాకుండా మూడోది, ఆయన జీవిత చరమాంకం. 12మంది పిల్లలున్న వ్యక్తి, తెలుగుజాతి వెలుగుదివ్వె అనుకునే వ్యక్తి, అపారమైన ఆస్తిపాస్తులు సంపాదించిన వ్యక్తి, దేశ రాజకీయాలను మలుపుతిప్పిన వ్యక్తి, ఓ అనాధలా, కేవలం రెండోభార్య సమక్షంలో మరణించడం, మరణించడానికి కొన్నాళ్ల ముందు రాష్ట్రం అంతటా పర్యటించి, తనకు తన కుటుంబ సభ్యలు చేసిన అన్యాయాన్ని చాటింపు వేయడం ఇవన్నీ చాలా కీలకమైన విషయాలు.

మామూలుగా అయితే ఓ ప్రముఖుడి బయోపిక్ కు ఇదంతా చాలా ఎమోషనల్ కంటెంట్. మహానటి సినిమాలో చూపించినది ఇదే. ఉవ్వెత్తున వెలుగు వెలిగిన ఓ తార, జీవిత చరమాంకంలో అనాధగా, ప్రభుత్వ ఆసుపత్రిలో పడివుండడం చూసేవాళ్ల గుండెలను పట్టుకుంటుంది. కానీ ఇలాంటి సబ్జెక్ట్ ను ఎన్టీఆర్ బయోపిక్ లో పక్కన పెట్టారు.

బసవతారకం పెర్ సెప్షన్ లో తీసాం అని చెప్పడం పెద్దకారణం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవిత చరమాంకం ఇలా అయిపోవడానికి కారణం, అల్లుడు చంద్రబాబు నాయుడు, ఆయన అధికారం లాక్కోవడంతో పాటు, కుటుంబ సభ్యులను తనవైపు తిప్పుకోవడమే అన్నది జగద్విదితం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా వున్నారు.

పైగా ఎన్నికలు ఎదర వున్నాయి. ఇలాంటి టైమ్ లో బయోపిక్ పూర్తిగా ఎన్టీఆర్ మరణం తీయడం అన్నది అసాధ్యం. అందుకే బసవతారకం వ్యూలో ఎన్టీఆర్ అనే అద్భుతమైన కారణం కనిపెట్టి ఎన్టీఆర్ బయోపిక్ అనబడే బసవతారకం బయోపిక్ తీసినట్లు కనిపిస్తోంది. బహుశా ఈ మూడోభాగాన్నే రామ్ గోపాల్ వర్మ తీస్తారేమో? 

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

మహిళా మంత్రికి సలహాలు.. పోటీ చేయకమ్మా డబ్బులు మిగులుతాయ్