ఎన్టీఆర్ బయోపిక్ విడుదల ఇంకో రెండురోజుల దూరంలో వుంది. తెలుగురాష్ట్రాల్లో 9న బుధవారం, అమెరికాలో 8 బుధవారం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలకమైన వ్యవహారం నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ కూడా బయోపిక్ లో వుండబోతోంది. అయితే అది తొలిభాగంలో కాదు, మలిభాగం మహానాయకుడులో వుంటుంది. అందువల్ల తొలిభాగానికి ఎటువంటి సమస్య వుండకపోవచ్చు.
ఈ మధ్య చాలాకాలం తరువాత నాదెండ్ల పేరు మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ లో నాదెండ్ల ఇచ్చిన పాత, కొత్త ఇంటర్వూలు మళ్లీ హల్ చల్ చేయడం మొదలయింది. ముఖ్యంగా వారంరోజుల క్రితం నాదెండ్ల ఇచ్చిన డిటైల్డ్ ఇంటర్వూలు వున్నాయి.
నాదెండ్ల ఈ ఇంటర్వూల్లో చంద్రబాబు గురించి, ఎన్టీఆర్ పిల్లల గురించి చాలా డిటైల్డ్ మాట్లాడారు. అసలు వెన్నుపోటు వారిదే అని వివరించారు. ఎన్టీఆర్ ఆస్తి, ఎన్టీఆర్ డబ్బులు, ఎన్టీఆర్ అధికారం, ఎన్టీఆర్ పార్టీ ఇలా ప్రతి ఒక్కటీ తీసుకుని, వెన్నుపోటు పొడించింది వారే అని వివరించారు.
అంతేకాదు, ఎన్టీఆర్ కు పక్షవాతం వస్తే పిడికెడు అన్నపెట్టని వారు పిల్లలు అని ఆరోపించారు. అందుకే లక్ష్మీపార్వతిని దగ్గరకు తీసారని, ఆమె చాలా సేవలు చేసిందని వివరించారు. చంద్రబాబుకు డబ్బు యావ అని విమర్శించారు.
ఇలా అన్నింటినీ ఏకరవు పెట్టిన నాదెండ్ల, బయోపిక్ మీద డైరక్టర్ క్రిష్ కు, హీరో బాలయ్యలతో పాటు, సెన్సారు బోర్డుకు కూడా తన లాయర్లు నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. దానిమీద కోర్టులో తన లాయర్లు కేసు వేస్తారని, మరి కోర్టు ఏం ఆదేశిస్తుందో చూడాలని అన్నారు.
అయితే ఇదంతా తొలిభాగం మీదనా? లేక తన పార్ట్ వుండే మలిభాగం మీదనా అన్నది కానీ, ఆ ప్రాసెస్ ఏ స్టేజ్ లో వుందన్నది కానీ నాదెండ్ల నుంచి క్లారిటీలేదు. అందువల్ల తొలిభాగం మీద నాదెండ్ల దృష్టి వుండకపోవచ్చు. ద్వితీయభాగం అన్నది ఫిబ్రవరిలో కాబట్టి వెయిట్ అండ్ సీ.