‘అగ్నిపథ్’ లో లోపం చక్కదిద్దితే బెటర్!

సైనిక నియామకాలను అగ్నిపథ్ ద్వారానే చేపట్టబోతున్నట్లుగా ప్రభుత్వం స్థిరనిర్ణయంతోనే ఉంది. ఎన్ని ఆందోళనలు వెల్లువెత్తుతున్నా కేంద్రం ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో.. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఆల్రెడీ నియామకాల నోటిఫికేషన్ వెలువడింది.…

సైనిక నియామకాలను అగ్నిపథ్ ద్వారానే చేపట్టబోతున్నట్లుగా ప్రభుత్వం స్థిరనిర్ణయంతోనే ఉంది. ఎన్ని ఆందోళనలు వెల్లువెత్తుతున్నా కేంద్రం ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో.. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఆల్రెడీ నియామకాల నోటిఫికేషన్ వెలువడింది. నేవీ ఓ వారంలో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఆర్మీకూడా త్వరపడుతోంది. ఈనేపథ్యంలో.. అగ్నిపథ్ పథకం రూపకల్పనలోనే ఉద్యోగార్థులకు ఇబ్బందికరమైన ఒక అంశాన్ని తొలగిస్తే/ సవరిస్తే వారిలో ఆగ్రహం కొంత తగ్గే అవకాశం ఉంది.

నాలుగేళ్ల శిక్షణ పూర్తయిన తర్వాత.. మెరిట్ చూపించిన 25 శాతం మందిని సైనిక సర్వీసుల్లోకి తీసుకుని, 75 శాతం మందికి సుమారు 12 లక్షల వంతున సేవానిధి ఇచ్చి తిరిగి పౌరజీవనంలోకి పంపేస్తారనేది ప్రస్తుతం పథకంలోని అంశం.

అయితే కేవలం మెరిట్ ఆధారంగా 25 శాతం తీసుకుని, 75 శాతం మందిని తిరస్కరించడంలో ఒక లోపం ఉంది. ఈ విధానం వల్ల టాప్ 25 మాత్రమే పర్మినెంట్ సైనిక సర్వీసులోకి వెళ్తారు. ఆ తర్వాతి బ్యాచ్ లో కూడా టాప్ 25 మాత్రమే వెళ్తారు. అయితే.. ఇలా ‘టాప్ 25’ అనేది మొత్తం బ్యాచ్ లోని ఇతరుల మీద కూడా ఆదారపడి ఉంటుంది. అందరూ అసమర్థులే అయినా.. టాప్ 25 అసమర్థులు పర్మినెంట్ సర్వీసులోకి వెళ్తారు. మొత్తం నూరుశాతం మందీ అత్యంత ప్రతిభావంతులైనా కేవలం 25 మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఇది చాలా ప్రతిభా వ్యత్యాసాలకు దారితీస్తుంది. 

ఫరెగ్జాంపుల్.. ఒక బ్యాచ్ లో 75 శాతం మందిలో భాగంగా ఇంటికి పంపబడిన వారు.. ఆ తర్వాతి బ్యాచ్ లో టాప్ 25 గా సర్వీసులోకి రాగలగిన వారికంటె ఎంతో అత్యుత్తమ ప్రతిభగల వారు అయి ఉండవచ్చు. అంటే రెండో బ్యాచ్ లో ఉన్నట్లయితే.. పర్మినెంటు సర్వీసు పొందగలిగిన ప్రతిభగలవారు.. కేవలం తొలిబ్యాచ్ లో ఉన్నందువలన ఇంటికి పంపబడి ఉంటారు. 

పైగా ఈ అగ్నిపథ్ స్కీమ్ లో ఉన్న ప్రధానలోపం మరొకటి ఏంటంటే.. ఒకసారి 75 శాతంలో భాగంగా ఇంటికి పంపబడిన వారు, మరోసారి ప్రయత్నించడానికి కూడా అనర్హులు. అందుకు నిర్దేశించిన వయస్సు దాటిపోతారు. అంటే.. ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వారికి అవకాశాలు మూసుకుపోతాయన్నమాట.

ఈ లోపాన్ని అధిగమించడానికి ఒక మార్గాంతరం ఉంది. ‘‘టాప్ 25 శాతం’’ అనే మాట కాకుండా, ప్రతి బ్యాచ్ లోను, వారిని బేరీజు వేయడానికి నిర్దిష్ట ప్రమాణాలను నిర్ణయించి.. ఆ ప్రమాణాల మేరకు ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తే సరిపోతుంది. దీనివల్ల అగ్నిపథ్ లో రెండు మూడు బ్యాచ్ లు పూర్తయిన తర్వాత కూడా.. రెగ్యులర్ సర్వీస్ కు ఎంపికైన వారు.. సమాన ప్రతిభావంతులు అయిఉంటారు. దీనివలన సైన్యం సమానమైన ప్రతిభగల వారితో సమున్నతంగా ఉంటుంది. 

ఇలా చేసినప్పుడు.. 75 శాతం మందిని వెనక్కు పంపేస్తారు అనే నిబంధన కాకుండా, ప్రతిభ లేని వారిని మాత్రమే వెనక్కు పంపుతారు.. అన్నట్లుగా ఉంటుంది. యువతలో ఆందోళన, నిరసనజ్వాలలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.