‘’..ఎవరండీ జగన్ రెడ్డి..ఎవరండీ ఈ సుబ్బారెడ్డి…విజయనగరం మీద వీళ్ల పెత్తనం ఏమిటండీ..’’
ఇదీ విజయనగరం సభలో చంద్రబాబు పలుకులు.
వింటుంటేనే నవ్వు వస్తోంది. ఉత్తరాంధ్రను గుప్పిట్లో పెట్టుకున్న సామాజిక వర్గాన్ని పునాదుల్లో దాచుకున్న పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడే మాటలేనా ఇవి? ఒక్కసారి ఉత్తరాంధ్ర గత పాతికేళ్ల చరిత్ర చూడండి చంద్రబాబూ? ఎవరు ఉత్తరాంధ్రకు వలస వచ్చి రాజకీయంగా ఆక్యుపై చేసారో అర్థం అవుతుంది.
ఎన్టీఆర్ తొలిసారి పార్టీ పెట్టగానే ఉత్తరాంధ్ర చివర్న వున్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చారు? ఏ సామాజిక వర్గానికి ఏ ప్రాతిపదికన కేటాయించారు. ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం కుటుంబాలు ఒక చేతి వేళ్లమీద అయినా లెక్కించేటన్ని వున్నాయా? ఆ రోజుల్లో?
విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ ఎవరికి ఇచ్చారు ఎన్టీఆర్. ఆ రోజుల్లో ఆ నియోజకవర్గంలో రెండో కుటుంబం వుందా ఆ సామాజిక వర్గానికి? మరి ఎలా కేటాయంచారు. నిజమే ఉత్తరాంధ్ర వాసుల తప్పే. మీరు ఈ రోజు అడిగినట్లు ఆ రోజు అడిగి వుంటే ఈ రోజు విశాఖపట్నం నిండా ఇంత మంది వేరే ప్రాంత వాసుల ఆధిపత్యం వుండేది కాదు.
గంటా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకుని మీరే కదా టికెట్ ఇచ్చింది చంద్రబాబూ…ఆయనది ఏ ప్రాంతం అని ఇచ్చారు? ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వచ్చారు కదా ఆయన? ఎమ్ వి వి ఎస్ మూర్తిది తూర్పుగోదావరి కదా? మీరు మద్దతు ఇచ్చిన కంభంపాటి హరిబాబుది ఉత్తరాంధ్ర యేనా? విజయమ్మ పోటీ చేసే నాన్ లోకల్ అని గొడవ చేసారే? మరి పురంధ్రీశ్వరి నాన్ లోకల్ కాదా? విశాఖలో మీరు మద్దతు ఇచ్చిన సిపిఐ, భాజపా, తేదేపా లీడర్లు అనేకం అంటే అనేక మంది నాన్ లోకల్స్ కాదా?
అంతెందుకు విశాఖ మైనింగ్ మొత్తం ఎవరి చేతిలో వుంది? కొండలు పిండి చేసి ఎవరు భోం చేసారు గత మూడు దశాబ్దాలలో. ఇలా రాసుకుంటూ పోతే ఉత్తరాంధ్ర మీద ఆధిపత్యం ఎవరిదో రికార్డుల సాక్షిగా తేలుతుంది. ఈ మూడేళ్లో విజయసాయి రెడ్డి వల్లనో, సుబ్బారెడ్డి వల్లనో ఆ హవాకు బ్రేక్ పడేసరికి, మీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకువచ్చింది..ఎవరండీ..ఎవరండీ అంటూ రంకెలు వేస్తున్నారు.
అదే రంకెలు మీద మీద వేస్తూ, మీ పార్టీ నాయకుల జాబితా ను బయటకు తీస్తే ఈ రెండు పేర్లకు బదులు రెండు వందల పేర్లు వస్తాయి బాబుగారూ.