ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఓ రేంజ్‌లో ప్రధాని మోదీపై సెటైర్స్ విసురుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల్ని చాకిరేవు పెడుతున్నారు. సైన్యంలో నాలుగేళ్ల కాలపరిమితికి ఉద్యోగులను నియమించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీం తీసుకొచ్చింది. దీన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ అభ్యర్థుల ఆందోళన విధ్వంసానికి దారి తీసింది.
రైళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టారు. ఈ నేపథ్యంలో యువతకు కేంద్ర మంత్రులు కీలక సూచన చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టొద్దని, అంతిమంగా ప్రజలే నష్టపోతారనేది ఆ ప్రకటన సారాంశం. దీనిపై నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. ప్రధాని మోదీ ఫొటో, ఆయనపై సెటైర్స్‌తో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“దయచేసి ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టకండి. అమ్మడానికి ఇబ్బంది అవుతుంది” అని మోదీ విజ్ఞప్తి చేస్తున్నట్టు పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తడం విశేషం. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆస్తులను అమ్మేటప్పుడు …అవి ప్రజల ఆస్తులని గుర్తు రాలేదా? అని నెటిజన్లు నిలదీశారు. అలాగే ఎల్ఐసీ ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వానికి ….యువత కడుపు మండి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే మాత్రం ప్రభుత్వ ఆస్తులంటూ నీతులు చెబుతారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
ఇలా ఒక్కటేమిటి మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని అమ్మడం, లేదంటే కార్పొరేట్ శక్తుల చేతులకు అప్పగించడమే కదా చేస్తోందంటూ తీవ్రస్థాయిలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరీ ముఖ్యంగా దేశాన్ని ఇద్దరు గుజరాతీలు (మోదీ, అమిత్‌షా) అమ్ముతుంటే, మరో ఇద్దరు గుజరాతీలు (అదానీ, అంబానీ) కొనుగోలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.