కార్మికోద్యమ నాయకుడు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దివంగత పీ. జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి మరోసారి పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. తాను పుట్టి పెరిగిన కాంగ్రెస్‌లో చేరడానికి ఆమె సమాయత్తమయ్యారు. ఈ మేరకు శనివారం ఆమె టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి పీజేఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పీజేఆర్ అనేంతగా మమేకం అయ్యామన్నారు.
అందుకే తనపై కాంగ్రెస్ కళ్లు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో తాను ఏ పార్టీలోకి వెళ్లినా ఇమడలేకపోతున్నట్టు విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. తండ్రి, తాతల కాలం నుంచే తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.
కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, నాయకులతో చర్చించి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనతో పాటు తన అనుచరులకు మంచి భవిష్యత్ వుంటుందని ఆశిస్తున్నట్టు విజయారెడ్డి తెలిపారు. తన తండ్రిని ఆదరించినట్టే తనకు అందరి ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నట్టు ఆమె వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదన్నారు. ఎందరినో పెద్ద నాయకుల్ని చేసిందన్నారు. జాతీయ స్థాయిలో సోనియాగాంధీ, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పని చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె ప్రకటించారు.
విజయారెడ్డి మొదట వైసీపీలో చేరారు. తెలంగాణకు వ్యతిరేక నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ నుంచి ఆమె బయటికెళ్లారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. కారణాలేంటో తెలియదు కానీ, తాజాగా ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.