అగ్నిపథ్ స్కీం దేశమంతా ఉద్రిక్తతకు దారి తీసింది. చాలా రాష్ట్రాల్లో విధ్వంసానికి ఈ స్కీం కారణమైంది. సికింద్రాబాద్‌లో శుక్రవారం తీవ్ర విధ్వంసం జరగడంతో తెలుగు సమాజం ఉలిక్కి పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా శనివారం విశాఖలో భారీ ర్యాలీకి ఆర్మీ అభ్యర్థులు, పలు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌పై దాడికి పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
దీంతో విశాఖ రైల్వేశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్‌పై దాడి జరిగిన తర్వాత ఏమీ చేయలేమని, ముందస్తు జాగ్రత్తలేమేలని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీసులు అప్రమత్తమై విశాఖ రైల్వేస్టేషన్‌ను మధ్యాహ్నం 12 గంటల వరకు మూసేయించారు. విశాఖ రైల్వేస్టేషన్‌కు వెళ్లే అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేయడం గమనార్హం.
అలాగే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గోదావరి, గరీబ్‌రథ్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లను దువ్వాడ, అనకాపల్లిలో నిలిపివేశారు. ప్రయాణికులు అక్కడే దిగి విశాఖ వెళ్లాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒడిశా, బెంగాల్‌వైపు వెళ్లే ప్రయాణి కులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు.
ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రయాణికులు విమర్శించారు. ఇదిలా వుండగా గుంటూరు జిల్లాలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆర్మీ అభ్యర్థులు నిరసన తెలిపారు. రైల్వే స్టేషన్ వైపు దూసుకొచ్చిన వారిని అరెస్టు చేశారు.