పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చేతిలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మోసపోయారా? అంటే… ఔనేమో అనే సమాధానం వస్తోంది. బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఓ ఆడియోని విడుదల చేశారు. తీవ్ర నిరాశనిస్పృహతో కూడిన స్వరంతో ఆయన “జీవితంలో ఎవరినీ నమ్మొద్దు” అని హెచ్చరించడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
జీవితంలో ఎవరినైనా నమ్మితేనే మోసపోతారు. నమ్మకపోతే పోయేదేమీ లేదు. పవన్‌కల్యాణ్ అంటే బండ్లకు వీరాభిమానం. పవన్ అంటే దేవుడని, రాముడికి ఆంజనేయుడి మాదిరిగా తాను ఆయనకు పరమభక్తుడని అనేక సందర్భాల్లో బండ్ల చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ విడుదల చేసిన ఆడియోలో హెచ్చరికతో కూడిన హితవు వుంది. ఆ ఆడియోలో ఏముందో తెలుసుకుందాం.
“జీవితంలో ఎవరినీ నమ్మొద్దు. మనల్ని మనం నమ్ముకుందాం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నమ్ముకుందాం. మన తల్లిదండ్రుల్ని ప్రేమిద్దాం. మనల్ని నమ్మి వచ్చిన భార్యని ప్రేమిద్దాం. మనం జన్మనిచ్చిన పిల్లల్ని ప్రేమిద్దాం. వాళ్లకు మంచి భవిష్యత్ ఇద్దాం. మనల్ని కన్న తల్లిదండ్రులకి మంచి జీవితాన్ని ఇద్దాం. ఎందుకంటే మనమీద వాళ్లు కోటి ఆశలతో ఉన్నారు. మన పిల్లలకి మంచి దారి చూపిద్దాం. వాళ్లవీళ్ల మోజులో పడి మన పిల్లల్ని, తల్లిదండ్రులకి అన్యాయం చేయొద్దు …మీ బండ్ల గణేష్” అని ఆయన చెప్పుకొచ్చారు.
బండ్ల గణేష్ అంటే పవన్‌కల్యాణ్ భక్తుడిగా ఎవరైనా గుర్తిస్తారు. పవన్ పేరు చెబితే చాలు బండ్ల గణేష్ పూనకం వచ్చినవాడిలా వూగిపోతారు. తాజా ఆడియోలో దేవుడిగా భావించే పవన్‌కల్యాణ్ ఊసేలేకపోవడంతో అందరి అనుమానాలు ఆ దిశగానే ఉన్నాయి. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు తప్ప మరెవరినీ నమ్మొద్దని ఆయన చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏమైంది గణేష్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేష్ నమ్ముకున్న ఏకైక వ్యక్తి పవన్‌కల్యాణే అని, లాభమైనా, నష్టమైనా అక్కడే జరిగి వుంటుందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. పవన్ వల్లే బండ్ల గణేష్ మోసపోయారేమో అనే అనుమానాలకు ఈ ఆడియో కారణమవుతోంది.
అసలేం జరిగిందో బండ్ల గణేష్ వివరిస్తే బాగుంటుందని, లేదంటే సమాజం పవన్‌ని అనుమానించే పరిస్థితి ఉందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బండ్లన్నా… వినిపిస్తోందా?