సికింద్రాబాద్ అల్లర్లకు తెలుగు రాష్ట్రాలతో లింక్

సికింద్రాబాద్ అల్లర్లకు రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్నట్టు స్పష్టమైంది. రెండు చోట్లా.. ఆర్మీ ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న…

సికింద్రాబాద్ అల్లర్లకు రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్నట్టు స్పష్టమైంది. రెండు చోట్లా.. ఆర్మీ ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రకాశం జిల్లా కంభంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేష్ బ్లాక్స్, 17/6 అనే పేర్లతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారని, దాడులకు ప్రధాన సూత్రధారి ఇతనేనని అనుమానిస్తున్నారు. ఆవుల సుబ్బారావుని నరసరావు పేటకు తీసుకెళ్తున్నారు.

పెట్రోల్ తీసుకురండి తగలెట్టేద్దాం..!!

ఆవుల సుబ్బారావు క్రియేట్ చేసినట్టుగా ఉన్న వాట్సప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్ లు కలకలం రేపుతున్నాయి. “ఎంతసేపు మనం మొత్తుకున్నా, నినాదాలు చేసినా ఎవరూ పట్టించుకోరు. పెట్రోల్ బాటిల్స్ తీసుకురండి, రైల్వే స్టేషన్ తగలబెట్టేద్దాం, మీడియాలో హైలెట్ అవుతుంది..” అనే వాట్సప్ మెసేజ్ లు కూడా నిన్న సర్క్యులేట్ అయ్యాయి. ఈ వాయిస్ మెసేజ్ లు ఇప్పుడు బయటపడ్డాయి. 

పోలీసులు పక్కాగా ఆధారాలన్నీ సేకరించారు. ప్రీ ప్లాన్డ్ గా ఇది జరిగిందని భావిస్తున్నారు. ఆయా గ్రూపుల్లో ఉన్నవారందరినీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 12మంది ప్రధాన కారకులు అనే అంచనాకు వచ్చారు.

కరీంనగర్‌కు చెందిన స్టార్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు వసీంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మరో 10 ఆర్మీ కోచింగ్ సెంటర్లు పరోక్షంగా యువకుల ఆందోళనకు సహకారం అందించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తున్నారు. ముందురోజు రాత్రి యువకులంతా సికింద్రాబాద్ చేరుకున్నారని, వారికి వసతి ఏర్పాట్లు కూడా కోచింగ్ సెంటర్లే కల్పించాయని తేలింది.

ఈ మొత్తం వ్యవహారాన్ని సాయి డిఫెన్స్ అకాడమీ వెనకనుండి నడిపించినట్టు చెబుతున్నారు. దీంతో ఆవుల సుబ్బారావు అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఇరు రాష్ట్రాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ వేగవంతం చేశారు.