రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా ఆది నుంచీ వివాదాస్పదంగానే వుంది. సినిమాకు సంబంధించి ఓ పాటను విడుదల చేయగానే ఆర్జీవీ మీద అనేక కేసులు కూడా పడ్డాయి. దానికి బదులుగా ఆయన కూడా నోటీసులు ఇస్తా అన్నారు. ఇదిలా వుంటే ఈ వ్యవహారంపై బాలయ్య స్పందన వేరేలా వుంది. అనేక అనుమానాలకు తావిస్తోంది. మీడియా ఇంటర్వూల్లో బాలయ్య మాటలు ఆ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ బాలయ్య అన్నదేమిటి?
''..ఆయన ఏం కథ తీస్తున్నారో? ఏ కొణంలో తీస్తున్నారో నాకయితే తెలియదు. ఏ సినిమా తీయాలన్నది ఆయన వ్యక్తిగతం. ఆయన ఇష్టం. ఆయన మా అనుమతి కోరలేదు. కానీ మేము మాత్రం, మా వాళ్ల అందరితో మాట్లాడి, అందరి అనుమతి తీసుకుని చేస్తున్నాం…''
ఈ మాటల్లో అనుమతి అన్న పాయింట్ నే అనుమానం రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం బతికివున్న వారి అనుమతులు తీసుకుని సినిమా చేస్తున్నారు. నాదెండ్ల భాస్కరరావుతో కూడా ఎన్టీఆర్ యూనిట్ మాట్లాడిందని, అనుమతి తీసుకుందని వార్తలు వినిపించాయి.
అంటే వర్మ కూడా తన బయోపిక్ కోసం చంద్రబాబు, ఎన్టీఆర్ కుమారుల అనుమతి తీసుకోవాలని చెప్పడం బాలయ్య మాటల అంతరార్థం అనుకోవాలా? అలా తీసుకోకపోతే అడ్డంకులు తప్పవని అనుకోవాలా? ఇదిలా వుంటే నాదెండ్ల భాస్కరరావు కోర్టుకు వెళ్తానని అనడంపై కూడా బాలయ్య స్పందించారు.
మనుషుల్లోని భావావేశాలు చూపిస్తున్నాం తప్ప మరేమీ కాదని, అయినా వున్నది వున్నట్లు చూపించకపోతే, ఇంక బయోపిక్ ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు. బహుశా అలా వున్నది వున్నట్లు చూపించాల్సి వస్తుందనే, బయోపిక్ ను తొలి ఆగస్టు సంక్షోభం వరకు చూపించి ఆపేసారన్నమాట.
మరి ఓ మనిషి పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు చూపించకపోతే అది బయోపిక్ ఎలా అవుతుందో? ఇది మాత్రం మీడియా అడగలేదు.. బాలయ్య చెప్పలేదు.