మొన్నీమధ్య ఏపీ అంబులెన్స్ లను హైదారాబాద్ లోకి రానివ్వడంలేదంటూ సరిహద్దుల్లో పెద్ద రచ్చ జరిగింది. హైదారాబాదులో బెడ్ దొరికినట్లుగా రుజువులు చూపిస్తేనే రానిస్తామని, ఇక్కడి కోవిడ్ కంట్రోల్ రూమ్ లెటర్ కూడా ఉండాలని తెలంగాణా గవర్నమెంటు నిబంధనలు పెట్టింది. దీంతో ఏపీ నుంచి కరోనా రోగులను తీసుకొస్తున్న అంబులెన్స్ లు ఏపీ -తెలంగాణా బార్డర్ లో భారీగా నిలిచిపోయాయి. ఇది వివాదానికి దారితీసింది. చివరకు తెలంగాణా హైకోర్టు ప్రభుత్వానికి బాగా తలంటేసరికి సమస్య పరిష్కారమైంది.
ఈ సందర్భంలో ఏపీ నాయకులకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయం గుర్తుకొచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, దీనిపై తమకూ హక్కులు ఉన్నాయని నాయకులు గగ్గోలు పెట్టారు. నిజమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానే. విభజన చట్ట ప్రకారం 2024 వరకు హైదారాబాద్ ఉమ్మడి రాజధానే. కానీ విభజిత ఏపీ మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు కారణంగా కావొచ్చు, మరో కారణం చేత కావొచ్చు ఉమ్మడి రాజధానిపై సగం హక్కులు వదులుకున్నారు. రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిగతా సగం కూడా వదులుకున్నారు.
విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానే కానీ, ప్రభుత్వ పరంగా ఎలాంటి హక్కు లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్ సర్కారుకు ఏనాడో ధారాదత్తం చేశారు. కాకపొతే ఇండియాలో రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఏ రాష్ట్రానికైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఎక్కడైనా బతుకుతెరువు చూసుకోవచ్చు. ఏ రాష్ట్రంలోనైనా చదువుకోవచ్చు, ఏ రాష్ట్రంలోని ఆస్పత్రిలోనైనా ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. కాదనే హక్కు పాలకులకు లేదు. కాబట్టి ఆంధ్రావాళ్ళు చికిత్స కోసం హైదరాబాదుకు రావడంలో తప్పులేదు.
రాష్ట్రం విడిపోయి ఏడేళ్ళేయింది. కానీ ఇంతవరకు ఏపీకి రాజధాని లేదు. చంద్రబాబు అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించినా దానిని రాజధానిగా జగన్ ప్రభుత్వం గుర్తించలేదు. వైసీపీ పాలకులు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఎడారి, స్మశానం, ఎందుకూ పనికిరాదు. జగన్ లెక్క ప్రకారం విశాఖపట్నం రాజధాని. అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని. కానీ ఇప్పటివరకు ఈ మూడు సాకారం కాలేదు. చివరకు ఏపీకి రాజధాని నగరం లేకుండా పోయింది. ఎలాంటి అభివృద్ధి లేదు. రాజధాని అనేది సమస్త సౌకర్యాలు కలిగివుండాలి.
ఏపీలోని ప్రజలు వైద్యం కావాలన్నా, చదువు కావాలన్నా, ఉపాధి కావాలన్నా రాజధానికి పోగలిగి ఉండాలి. కానీ ఏపీ ప్రజలకు అలాంటి వెసులుబాటు, సౌకర్యం లేవు. రాజధాని లేదు కాబట్టి దాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు. ఏ విషయంలోనైనా వారికి వెంటనే కనపడేది హైదారాబాద్. ఏపీ ప్రజలు వైద్య చికిత్సకైనా, ఉన్నత చదువులకైనా, కూలి పనులు మొదలుకొని పెద్ద ఉద్యోగాలకైనా హైదరాబాదుకు రావాల్సిందే. రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్ళైనా ఆంధ్రా నుంచి రోజూ కుప్పలు తెప్పలుగా హైదరాబాదుకు వస్తూనే ఉన్నారు.
ఇలా రావడం 2024 తరువాత కూడా అంటే ఉమ్మడి రాజధాని హక్కు తీరిపోయిన తరువాత కూడా జరుగుతూనే ఉంటుంది . ఎందుకంటే ఏపీకి అధికారిక రాజధాని ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పలేం. ఎప్పుడు హైదరాబాదులా అభివృద్ధి చెందుతుందో చెప్పలేం. ఎప్పుడు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందో చెప్పలేం. ఆంధ్రాలో రాజకీయాలను, అక్కడి పరిస్థితులను చూస్తుంటే ఇంకో యాభై ఏళ్ళకైనా హైదరాబాదు లో సగం మేరకైనా అభివృద్ధి చెందుతుందా అనే సందేహం కలుగుతోంది. కాబట్టి ఏపీ ప్రజలకు హైదరరాబాద్ ఎప్పటికీ రాజధానిగానే ఉంటుంది.
పాలనాపరంగా కాకపోవచ్చుగాని ఇతరత్రా విషయాల్లో ఏపీ ప్రజలు హైదరాబాద్ వైపే చూస్తారు. ఆంధ్రా ప్రజలకు హైదరాబాద్ తో విడదీయరాని అనుబంధం ఉంది. గత కొన్ని తరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నవాళ్లకు అనుబంధం ఉంటుందంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఏపీలోనే పుట్టి పెరిగిన వారికి కూడా హైదరాబాద్ మీదనే మోజు. యువత హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్ళడానికి తొందరగా ఇష్టపడరు. ఇందుకు కారణం …వారు కోరుకున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితి ఆంధ్రాలో లేదు. సచివాలయంలోని ఆంధ్రా ఉద్యోగులు చంద్రబాబు హయాంలో ఆంధ్రాకు తరలిపోయారు. వారిలో చాలామంది హైదరాబాదుకే వచ్చి స్థిరపడతారు. ఏ కోణంలో చూసుకున్నా ఆంధ్రులకు హైదరాబాదుతో అనుబంధం తెగిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఓ బలమైన సెంటిమెంట్.