ముఖ్యమంత్రిగా జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలు వందకు వంద మార్కులు వేశారు. మరి మంత్రివర్గంలో అందరి పరిస్థితి ఇలానే ఉందా అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఏపీ మంత్రులంతా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నారో లేదో మదింపు చేసే రోజులు దగ్గర పడ్డాయి. మంత్రి వర్గంలో మార్పుచేర్పుల గురించి సీఎం జగన్ చెప్పిన రెండున్నరేళ్ల డెడ్ లైన్ కి ఇంకా 6 నెలలే గడువు ఉంది.
రెండున్నరేళ్లకు మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశమిచ్చి, పనితీరు ప్రకారం పాతవారిని పక్కనపెట్టేందుకు జగన్ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో మంత్రుల్లో గుబులు, ఆశావహుల్లో ఉత్సాహం ఒకేసారి మొదలైంది. విస్తరణలో భాగంగా కొత్తగా వచ్చేది ఎవరు? పదవులు పోగొట్టుకునేది ఎవరనే చర్చ పార్టీలో మొదలైంది.
అయితే జగన్ మనసులో ఏముందో ఎవ్వరూ గెస్ చేయలేరు, పైగా ఇలాంటి కీలక అంశాలపై ఆయన పెద్దగా ఎవరితో చర్చించరు, ఒకవేళ చర్చించినా వాటిని బయట పెట్టేందుకు ముఖ్యనేతలెవరూ సాహసం చేయరు. అయితే అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కరోనా వల్ల పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోవడంతో, ఆ ప్రభావం కొన్ని శాఖలపై గట్టిగా పడింది. ఇలాంటి టైమ్ లో సదరు మంత్రుల పనితీరును అంచనా వేయడం కాస్త కష్టమే.
2019 నాటికి, ఇప్పటికి ఏపీలో వైసీపీకి ఉన్న ఆదరణలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే 2024 నాటికి సమీకరణాలు మారే అవకాశం ఉంది. సహజంగానే ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి మొదలవుతుంది. అదే సమయంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జగన్ ని దింపేసేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ దశలో 2024 ఎన్నికల్ని ఇదే టీమ్ తో ఎదుర్కోవాలా? లేక సరికొత్త టీమ్ తో ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలా అనేదే ఇప్పుడు జగన్ ముందున్న అసలు ప్రశ్న.
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో అందరు మంత్రులు ఒకేలా కష్టపడలేదనే విషయం బహిరంగ రహస్యం. ఫలితాలు కూడా ఈ విషయాన్ని కళ్లకుకట్టాయి. మరోవైపు మంత్రి పదవులు ఆశించేవారి కష్టాన్ని కూడా తీసిపారేయలేని పరిస్థితి. ఈ దశలో పాత మంత్రుల్ని కొనసాగించడం కంటే.. గతంలో ఉన్న అసంతృప్తుల్ని బుజ్జగించి, ఎవరి సత్తా ఎంతో తేల్చుకోడానికి మంత్రివర్గంలో మార్పులు చేర్పులకే జగన్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తొలిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు, యువతకు పెద్దపీట వేసిన జగన్.. ఈసారి మలిదశ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. సామాజిక సమీకరణాలు మారకపోయినా, మార్పులు అనివార్యం అని అంటున్నారు. కొత్త కేబినెట్ తో 2024 ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి.. జగన్ తన టీమ్ ని మరింత పగడ్బందీగా ఎంపిక చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.