సినిమాకు బజ్ రావడం అన్నది దానికి చేపే పబ్లిసిటీ మీద, వినిపించే విశేషాల మీద ఆధారపడి వుంటుంది. ఆ విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించింది. థాంక్స్ బయోపిక్ పీఆర్ టీమ్. అయితే ఈ సినిమాను బాలయ్య సినిమా రేట్లతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ రేట్లకే కొన్నారు బయ్యర్లు. సినిమా ఎలా వచ్చిందో? వస్తోందో? అన్నదే వాళ్ల టెన్షన్.
బయోపిక్ సెన్సారు పూర్తయిన తరువాత ఇండస్ట్రీలో మారుమోగిన ఎంక్వయిరీలే ఇందుకు సాక్ష్యం. సెన్సారు టాక్ ఏమిటి? సెన్సారు టాక్ ఏమిటి? ఇదే ఫ్రశ్న ఇండస్ట్రీలో పలువురి నోట. ఎప్పుడైతే సెన్సారు టాక్ పాజిటివ్ అన్నమాట బయటకు వచ్చిందో బయ్యర్లు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా ఓకె. మహానటి మాదిరిగా వుంది. క్లాస్ టచ్, క్లాస్ నెరేషన్ అన్న టాక్ బయటకు వచ్చింది.
అన్నింటికన్నా కీలకమైనది మహానటిలో కీర్తిసురేష్ ను సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల తరువాత జనం మరిచిపోయారు. సావిత్రిగానే ఫీలయ్యారు. బయోపిక్ లో బాలయ్యను కూడా అలాగే మరిచిపోయి, ఎన్టీఆర్ లా ఫీల్ కావాలి. అప్పుడే సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ విషయంలో కూడా ఆఫ్టర్ సెన్సారు టాక్ పాజిటివ్ గానే వుంది.
బయోపిక్ ఫస్ట్ పార్ట్ ను ఆంధ్రలో 30కోట్ల రేషియోలో ఇచ్చారు. నైజాంలో 16 కోట్ల అడ్వాన్స్ మీద ఇచ్చారు. సీడెడ్ 12 కోట్లకు ఇచ్చారు. ఓవర్ సీస్ అంతా కలిపి 20 కోట్లు అందులో రెండు కోట్లు రిటర్న్ గ్యారంటీ మీద ఇచ్చారు.
అయితే ఇక్కడ బయ్యర్ల అడ్వాంటేజ్ ఏమిటంటే, ఫస్ట్ పార్ట్, రెండో పార్ట్ వాళ్లకే ఇవ్వడం. ఫస్ట్ పార్ట్ లో రికవరీ అయిపోతే, రెండోభాగం కమిషన్ మీద డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేదా ఫస్ట్ పార్ట్ లో పూర్తిగా రికవరీ కాకపోతే, రెండోభాగంలో మిగిలినది రికవరీ చేసుకుని, ఆపైన మిగిలినది కమిషన్ కట్ చేసుకుని ఇవ్వాలి.
ఈ ఆఫర్, ప్లస్ ఈ టాక్ తో బయ్యర్లు హ్యాపీగానే వున్నారు.