అయితే గుణపాఠం..లేదంటే గడ్డుకాలం

మరి కొద్ది గంటల్లో ఆంధ్రలో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అలాగే కొన్ని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. అన్నింటిలో కీలమైనవి రాజధాని ప్రాంతంలోవున్న విజయవాడ, గుంటూరు, అలాగే రాజధాని కాబోతున్న విశాఖ…

మరి కొద్ది గంటల్లో ఆంధ్రలో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అలాగే కొన్ని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. అన్నింటిలో కీలమైనవి రాజధాని ప్రాంతంలోవున్న విజయవాడ, గుంటూరు, అలాగే రాజధాని కాబోతున్న విశాఖ కార్పొరేషన్లు. వీటి ఫలితాలు అధికార, ప్రతిపక్షాలు రెండింటికీ కీలకం. 

రెండేళ్ల క్రిందట అధికారంలోకి వచ్చిన వైకాపా సంక్షేమ పథకాలే ఆలంబనగా పాలన సాగిస్తోంది. ఎన్ని విదాల దాడి చేయాలో అన్ని విధాలా ప్రభుత్వం మీద గత రెండేళ్లుగా దాడి జరిగింది. మతం కార్డు వాడారు. కులం కార్డు వాడారు. ఇసుక అన్నారు, భవన నిర్మాణ కార్మికులు అన్నారు. రౌడీయిజం అన్నారు. ఇలా వాడని కార్డు లేదు. కుట్రలు, కుతంత్రాలు చేసారు. గుళ్ల పై దాడులు చేసి వైకాపా ఖాతాలో వేసారు. ప్రతీ కార్డు ఉన్నట్లుండి చటుక్కున మాయం అయినవే. 

ఇలాంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు వచ్చాయి.గుంటూరు, విజయవాడ దగ్గర నూరు రోజులకు పైగా రాజధాని ఉద్యమం తెలుగుదేశం అనుకూల మీడియాలో సాగుతోంది. అందువల్ల అది నిజంగా వుంటూ ఈ ఎన్నికల్లో కచ్చితంగా ప్రతిఫలించాలి. అలాగే విశాఖ ఉక్కు సమస్య. తెలుగుదేశం పార్టీ, దాని మద్దతు దారులు విపరీతంగా ప్రచారం చేసి, దాన్ని మోడీ ఖాతాలోంచి లాక్కుని మరీ వైకాపా ఖాతాలోకి వేసేసారు. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖలో తెలుగుదేశం తన పట్టు చాటుకుంది. 

తెలుగుదేశం మూలాల్లో వున్న సామాజిక వర్గం విశాఖ మీద దశాబ్దాల కాలంగా సాధించిన పట్టును కోల్పోకూడదని కిందా మీదా అవుతోంది. విజయసాయిరెడ్డి ధాటిని తట్టుకోలేక విలవిల లాడుతోంది. ఇలాంటి నేపధ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. రాజధాని సమస్య వున్న విజయవాడ, గుంటూరుల్లో అలాగే తమ పట్టువున్న విశాఖలో పరువు నిలబెట్టుకొవాల్సిన పరిస్థితి, అగత్యం తెలుగుదేశం పార్టీకి వున్నాయి. 

ఈ పరిస్థితి గమనించి చినబాబు లోకేష్ ను నమ్ముకోకుండా పెదబాబు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి నానా మాటలు మాట్లాడేసారు. పులివెందుల అన్నారు. ఫ్యాక్షనిజం,రౌడీయిజం అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు సకల శస్త్రాలూ వాడేసారు. అవన్నీ చాలక జనాలను తిట్టడం మొదలు పెట్టారు. మీకు సిగ్గు లేదు, శరం లేదు..పౌరుషం లేదు అంటూ నానా విధాలుగా రెచ్చగొట్టారు.

ఇన్ని చేసిన తరువాత ఇప్పుడు కానీ మూడు చోట్లా గెలవకపోతే, ఇక తెలుగుదేశం 2023 మీద కూడా ఆశలు వదిలేసుకోవాల్సి వుంటుంది. ఎందుకుంటే ఇప్పుడు వాడని అస్త్రం లేదు. వాడని కార్డ్ లేదు. సకలం వాడేసారు. మరో రెండేళ్ల వరకు ఎన్నికలు లేవు. ఈ రెండేళ్లు చేయగలిగిందీ లేదు. పైకా ఈ మూడు చోట్ల పరువు దక్కకపోతే తెలుగుదేశం పార్టీ ఇక గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మరో రెండేళ్లు ఏ అలజడి చేయకుండా పార్టీ జనాలను పట్టి ఆపడం కష్టం. ఇప్పటికే జారిపోవడానికి రెడీ గా వున్నారు. ఈ ఎన్నికల్లో ఆశలు ఏమైనా చిగురిస్తే వుంటారు. లేదంటే జారిపోతారు. 

ఒక విధంగా వైకాపాకు ఇది ఆసిడ్ టెస్ట్ . ఈ పరీక్ష పాసయిపోతే ఇక రెండేళ్ల వరకు తిరుగు వుండదు. దేశం అనుకుల మీడియా రాయడానికి ఏమీ వుండదు. కానీ తేడా వస్తే మాత్రం వైకాపా తన వ్యవహార శైలి గురించి ఆలోచించాల్సి వుంటుంది. పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగకుండా నిర్వహించిన ఎన్నికలు ఇవి. ఇలాంటి తీరు ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీ అధినేత అయినా పోటా పోటీ పరిస్థితి వస్తే రంగంలోకి దిగి హడావుడి చేస్తారు. 

జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వుండిపోయారు. మంత్రులు, కీలక నాయకులు తమదే సమస్య అంతా అన్నట్లు పనిచేసారు. అందువల్ల వ్యవహారం బెడిసి కొడితే వారి మీద అధినేత ఆగ్రహించినంత మాత్రాన సరిపోదు. తన వ్యవహారం శైలిని జగన్ కూడా పునసమీక్షించుకోవాల్సి వుంటుంది. కేవలం సంక్షేమ పథకాలు గట్టెక్కించవని తెలిసి వస్తుందో, లేదా వెళ్తున్న దారే సరైనదని తేలుతుందో చూడాలి. 

మొత్తం మీద మరికొన్ని గంటల్లో రాబోయే ఫలితాలు చాలా విషయాలను వెల్లడించబోతున్నాయి.

నా సినిమాలు ఎక్కువగా ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

ఇదంతా జ‌గ‌న్ శ్ర‌మ ఫ‌లితమే..