ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే పౌరులకు అనుమతిస్తున్నారు. అయితే ఇలా అమలుచేస్తున్న కర్ఫ్యూతో పెద్దగా ఉపయోగం ఉన్నట్టు కనిపించడం లేదు. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులతో ప్రభుత్వం ఇప్పుడు మరోసారి ఆలోచనలో పడింది. సంపూర్ణ లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచన చేస్తోంది.
ఏదైనా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10శాతం ఉంటే లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాజిటివ్ కేసులు 20శాతానికి చేరుకున్నాయి. అనధికారిక లెక్కలు కూడా కలుపుకుంటే సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇలాంటి టైమ్ లో కర్ఫ్యూతో ఆశించిన ప్రయోజనం దక్కదని అంటున్నారు అధికారులు. కంప్లీట్ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు.
ఏపీలో 11 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20శాతానికి చేరుకుంది. ఓవైపు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడం లేదు. మరీ ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి చేయిదాటేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమంటున్నారు అధికారులు.
ఇదే అంశంపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తంచేసింది. ఏప్రిల్ నుంచి ఏపీలో పాజిటివిటీ రేటు పెరుగుతోందని.. వారం వృద్ధిరేటు 30శాతం వరకు ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అత్యథికంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యథికంగా కరోనా కేసులు పెరుగుతున్న టాప్-10 జిల్లాల్లో తూర్పుగోదావరి ఆరో స్థానంలో, విశాఖపట్నం పదో స్థానంలో ఉన్నాయి. దేశంలోని 516 జిల్లాల్లో 10శాతానికి మించి పాజిటివిటీ రేటు ఉండగా.. అందులో ఏపీలోని అన్ని జిల్లాలు ఉండడం బాధాకరం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.