ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనేది ఆ యువకుడి కల. పేదింట్లో పుట్టినా, దేశం కోసం పరితపించాడు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం శాశ్వతంగా తన కలలకు సమాధి కడుతుందని ఆందోళన చెందాడు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామి కావాలని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వచ్చాడు.
ఉద్యమిస్తున్న యువకుడిపై పోలీసుల తూటా పేలింది. దీంతో అతని కలలు కల్లలయ్యాయి. చేతికొచ్చిన కుమారుడు కుటుంబానికి ఆదరువుగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలను పోలీసుల తూటా ఛిద్రం చేసింది. తూటా ఒక్కటే…కానీ ఎంతో మంది ఆశయాల్ని, ప్రేమల్ని నేలకూల్చింది.
ఒకే ఒక్క తూటా… తల్లిదండ్రులకి కొడుకుని దూరం చేసింది. ఒకే ఒక్క తూటా ఇద్దరక్కలకు తమ్ముడిని దూరం చేసింది. ఒకే ఒక్క తూటా స్నేహితులకు ఆత్మీయుడిని అందనంత దూరం చేసింది. ఒకే ఒక్క తూటా భరతమాత నూనూగు మీసాల కాబోయే సైనికుడిని కోల్పోయేలా చేసింది. ఈ ఆవేదన, ఆక్రోశం అంతా ఇవాళ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వరంగల్‌కు చెందిన రాకేష్ గురించే.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేష్‌కు చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరడం ఒక కల. రాకేష్ సోదరి రాణి ఐదేళ్ల క్రితం బీఎస్ఎఫ్లో చేరింది. ప్రస్తుతం ఆ యువతి పశ్చిమబెంగాల్లో పని చేస్తోంది. మరొక అక్క ఇంటిపట్టునే ఉంటుంది. ఆమెకు ఓ రైతుతో వివాహమైంది. రాకేష్ అన్న వికలాంగుడు. తల్లిదండ్రులు నిరుపేదలు. రాకేస్ ఎలాగైనా ఆర్మీకి ఎంపికవుతాడని, తమకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని తల్లిదండ్రులు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు.
రెండేళ్ల క్రితం ఆర్మీ ఎంపిక కోసం రాకేష్ వెళ్లాడు. అన్ని రకాల ఫిజికల్ పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఇక ఎగ్జామ్ రాయాల్సి వుంది. అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో రెండేళ్లుగా వాయిదా వేస్తూ వచ్చిందని రాకేష్ స్నేహితులు చెబుతున్నారు. రెండురోజుల క్రితం రాకేష్ హైదరాబాద్ వచ్చినట్టు అతని స్నేహితులు మీడియాకు చెప్పారు.
ఆర్మీకి ఎంపికై, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేయాలనే ఆశయం నెరవేరకుండానే తనువు చాలించాడని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.