ర‌హ‌స్యంగా గోడ‌దూకి…లోప‌లికెళ్లి!

బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళ‌న రోజురోజుకూ ఉధృత‌మ‌వుతోంది. రాజ‌కీయ ప‌క్షాలు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో విద్యార్థుల ఆందోళ‌న రాజ‌కీయ టర్న్ తీసుకుంది. మ‌రోవైపు త‌మ డిమాండ్లు నెర‌వేర్చే వ‌ర‌కూ నిర‌స‌న విర‌మించేది లేద‌ని విద్యార్థులు…

బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళ‌న రోజురోజుకూ ఉధృత‌మ‌వుతోంది. రాజ‌కీయ ప‌క్షాలు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో విద్యార్థుల ఆందోళ‌న రాజ‌కీయ టర్న్ తీసుకుంది. మ‌రోవైపు త‌మ డిమాండ్లు నెర‌వేర్చే వ‌ర‌కూ నిర‌స‌న విర‌మించేది లేద‌ని విద్యార్థులు తేల్చి చెప్పారు. మ‌రోవైపు చాన్స్‌ల‌ర్ హోదాలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై విద్యార్థుల నిర‌స‌న‌పై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వర్షంలో తడుస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులను చూస్తే… తనకు చాలా బాధ కలుగుతోందని అమె వాపోయారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘మీరు (విద్యార్థులు) ఇంకా భవిష్యత్‌ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. మీ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాల్సి ఉంది. అందుకని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అని ఆమె ట్వీట్‌ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ఈ నేప‌థ్యంలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి పోలీసుల క‌న్నుగ‌ప్పి విద్యార్థుల వ‌ద్ద‌కెళ్లారు. రేవంత్ రెడ్డి పోలీసుల వలయాన్ని ఛేదించి రహస్యంగా గోడ దూకి లోపలికి ప్రవేశించారు. 

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకెళ్లి వారి గోడు విన్నారు. రేవంత్‌రెడ్డి అక్క‌డికి చేరుకున్న విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు హ‌డావుడిగా అక్క‌డికెళ్లారు. రేవంత్‌రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టుపై ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.