ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు వుండకూడదు. కానీ, దురదృష్టవశాత్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ భౌతిక దాడులతో చెలరేగిపోతున్నాయి రాజకీయ పార్టీలు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్. చంద్రబాబు హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద హత్యాయత్నం జరిగితే, ‘కోడి కత్తి’ అంటూ వెటకారం చేశారు అప్పటి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబునాయుడు. అప్పటి హోంమంత్రి, అప్పటి డీజీపీ కూడా ఇదే తీరున మాట్లాడటం చూశాం.
కానీ, ఇప్పుడు చంద్రబాబు మారిపోయారు. చంద్రబాబులో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ప్రజాస్వామ్యం ఆయనకు గుర్తుకొచ్చింది. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ మధ్య రోడ్డు మీద కూర్చోవడం అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది చంద్రబాబుకి. టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్న గుంటూరులో పర్యటిస్తుండగా వారిపై దాడి జరిగింది.. వైసీపీ కార్యకర్తలే వారిపై దాడి చేశారు.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.
రాజకీయాల్లో ఇలాంటివి అవాంఛనీయమే అయినా.. సర్వసాధారణమైపోయాయి. ప్రస్తుతం రాజకీయాలే అలా తగలడ్డాయ్. చంద్రబాబు హయాంలో ఇలాంటివి చాలానే జరిగాయి. అప్పట్లో ఎప్పుడూ చంద్రబాబు ఆ దాడులపై పెదవి విప్పలేదు. ‘హుందాతనం’ ఇప్పుడు, ఇన్నాళ్ళకు.. అధికారం పోయాక చంద్రబాబుకి గుర్తుకొస్తోంది.
దాడి చేసినవారు తమ పార్టీ వారే అయినా ఉపేక్షించలేదు.. వైసీపీ కార్యకర్తల అరెస్ట్ జరిగింది. ‘ముందస్తు సమాచారం స్థానిక పోలీసులకు ఇచ్చి పర్యటనలు చేస్తే మంచిది..’ అని సాక్షాత్తూ హోంమంత్రి సుచరిత గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికీ, ఇప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికీ అదే తేడా. ఈ తేడా తెలుసుకోలేనంత అమాయకత్వమైతే చంద్రబాబుకి వుందని అనుకోలేం.
పార్టీ నుంచి నేతలు ఒకరొకరుగా జారిపోతున్నారు.. అదీ చంద్రబాబులో అసహనానికి అసలు కారణం. స్థానిక ఎన్నికల్లో గెలవడం సంగతి.. స్థానిక ఎన్నికలు పూర్తయ్యేలోపు, తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే స్థాయిలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. లోపల తగిలిన దెబ్బ ఇంకోటి.. పైకి చంద్రబాబు చెబుతున్నదీ, చేస్తున్నదీ ఇంకోటి.