ఆగ్రహంతో రెచ్చిపోవడం.. తమ అధికారానికి మరింత వన్నె తెస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, దళాలు భ్రమిస్తున్నారేమో తెలియదు. తమ ఇష్టమొచ్చినట్లుగా ఎంత దారుణంగా వ్యవహరించినా.. అడిగే వారు లేరు అని చెలరేగిపోతుండవచ్చు. కానీ.. ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవాళ జరిగిన దుందుడుకు చర్యలు లాంటివి మళ్లీ మళ్లీ రిపీట్ అయితే గనుక.. వైకాపా పార్టీనే చీదరించుకోవడానికి.. ఆ ప్రజలు వెనుకాడరనే సత్యం వారు గ్రహించాలి.
స్థానిక ఎన్నికలు అంటేనే ఆవేశ కావేషాలకు నిలయంగా ఉంటాయి. చిన్న యూనిట్ గా గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు గనుక.. వ్యక్తిగత స్పర్ధలు, విభేదాలకు అవి ప్రతిబింబంగా ఉంటాయి. వ్యక్తుల మధ్య తగాదాలు జరగడం.. నామినేషన్లను అడ్డుకోవడానికి, ఇతరత్రా గొడవలు చెలరేగడం.. ఇలాంటి ఎన్నికల్లో సహజమే అని సర్దిచెప్పుకోవచ్చు.
కానీ.. తెలుగుదేశానికి చెందిన నాయకుల వాహనాలపై దాడి చేయడం.. విధ్వంసం సృష్టించడం అనేది సమర్థించుకోదగినది కాదు. వారి వాహనం ఒక పసివాడికి తగిలిందనే ఆరోపణ వారివైపు నుంచి వస్తున్నది.. అదే సమయంలో అలాంటి ప్రమాదానికి ప్రతిస్పందన గురించిన పశ్చాత్తాపం మాత్రం రావడం లేదు. ఇలాంటి ధోరణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేటుచేస్తుందని గ్రహిస్తే బాగుంటుంది.
మేష్టారు కనీసం బెత్తం ఝుళిపించకముందే.. దెబ్బ పడిపోయినట్లుగా కుయ్యోమొర్రో అని కేకలు పెట్టే అల్లరి పిల్లవాడి మాదిరిగా.. చంద్రబాబునాయుడు కూడా జనం అందరి దృష్టిని తనవైపు ఆకర్షించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాల్ని చాలా ముందుగానే ప్రారంభించేశారు. నామినేషన్ల పర్వం మొదలు కావడానికి ముందే.. వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు.. భయాందోళనలు సృష్టిస్తున్నారు… అంటూ ఆయన ప్రతిరోజూ విమర్శలు ప్రారంభించారు.
దానికి తగ్గట్లుగానే నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత.. అక్కడక్కడా కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతూ వచ్చాయి. వాటిని భూతద్దంలో చూపిస్తూ.. దొమ్మీలు జరిగిపోయినంత దారుణంగా చిత్రీకరిస్తూ చంద్రబాబునాయుడు మైలేజీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇవాళ మాచర్లలో జరిగిన దాడులు ఇటీవలి ఘర్షణలకు పరాకాష్ట. తెదేపా నాయకుల కారు బాలుడికి తగిలిందంటూ వైకాపా వారు చెబుతున్నారు గానీ.. ఆ సంఘటనకు, దానికి జవాబుగా కారుమీద చేసిన దాడికి పొంతన లేదు.
ఈ దాడిలో ఇంకేమైనా అవాంఛనీయ పరిణామాలు జరిగి ఉంటే.. పరిస్థితి ఇంకా తీవ్రమై ఉండేది. ఈ దాడులను సమర్థించడంతోనే… అది వైకాపా దళాల పనిగా.. లోకల్ ఎమ్మెల్యే చాటిచెప్పినట్లు అయింది. వైకాపా శ్రేణులు ఎలాంటి ఉద్దేశంతో ఈ దాడులు చేశారో గానీ.. వారి చేతలు.. కొన్ని రోజులుగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మేలా చేశాయి.