కన్నా రీప్లేస్‌మెంట్ కూడా ఇప్పుడేనా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి మార్పు జరిగిపోయింది. అక్కడ ఇప్పటిదాకా సారథ్యం వహిస్తున్న లక్ష్మణ్ ను తొలగించి.. బండి సంజయ్ ను నూతన అధ్యక్షుడిగా నియమించారు. ఈ సమయంలో.. ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిని…

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి మార్పు జరిగిపోయింది. అక్కడ ఇప్పటిదాకా సారథ్యం వహిస్తున్న లక్ష్మణ్ ను తొలగించి.. బండి సంజయ్ ను నూతన అధ్యక్షుడిగా నియమించారు. ఈ సమయంలో.. ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిని మార్చడం అనే అంశం కూడా తిరిగి చర్చకు వస్తోంది. కన్నా లక్ష్మీనారాయణను మార్చడం అనేది చాలా రోజులుగా పార్టీలో చర్చనీయాంశంగానే ఉంది. అయితే.. ఆయన స్థానంలో ఎవరు వస్తారన్నదే ఇదమిత్థంగా తేలడం లేదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం చాలా ముమ్మరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ కి  ఈ ఎన్నికల మీద పెద్దగా ఆశల్లేవు. పోటాపోటీగా బరిలోకి దిగాలనే సంకల్పాలు కూడా పెద్దగా లేవు. కాకపోతే.. గ్రామస్థాయిలో అంతో ఇంతో రేపటికైనా సరే.. కాస్తంత గుర్తింపు పొందడం ఈ ఎన్నికల ద్వారా సాధ్యమవుతుందని అనుకుంటున్న కొందరు మాత్రమే.. ఆ పార్టీ ముద్రతో పోటీచేయవచ్చు.

ఏది ఏమైనప్పటికీ.. ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్నది గనుక.. తక్షణమే కన్నా లక్ష్మీనారాయణను మార్చే నిర్ణయం వెలువడకపోవచ్చు. ఎన్నికల తర్వాత.. అంటే ఏప్రిల్ నెలలో ఏపీ భాజపా చీఫ్ గా కొత్త నేత వస్తారనే అంచనాలు సాగుతున్నాయి.

ఈ ఎంపికలో భాజపా కుల సమీకరణలకు పెద్దపీట వేయనుంది. రాష్ర్టంలో రెడ్డి, కమ్మ కులాలు రెండు పెద్ద పార్టీలను ‘ఓన్’ చేసుకున్న సమయంలో.. మరో ప్రధానకులం ‘కాపు’ను చేరదీసినట్లుగా కనిపించడానికి భాజపా కన్నా లక్ష్మీనారాయణకు పదవి ఇచ్చింది. ఇప్పుడు కాపు ఓటు బ్యాంకును తమవైపు ఆకర్షించడానికి ఏకంగా పవన్ కల్యాణే తమ అమ్ముల పొదిలో ఉన్నాడు గనుక.. ఇక వారికి కాపు కార్డు అక్కర్లేదు. ప్రయారిటీ లేదు. కానీ.. అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో సోము వీర్రాజు, మాణిక్యాల రావు వంటి ఆ వర్గం ప్రముఖులే ఉన్నారు.

పార్టీ మాత్రం.. కాపుల చేతిలో ఉన్న పదవిని మరో సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఇతర పార్టీల నుంచి కొత్తనీరు వచ్చి చేరిన తర్వాత.. కమ్మ వర్గం నుంచి ఆ పదవి ఆశించే వారు ఎక్కువే ఉన్నారు… కాకపోతే.. అసలే అగ్రవర్ణాల పార్టీగా ముద్ర ఉన్న భాజపా… ఈసారి పదవిని బీసీలకు ఇచ్చే ప్రయోగం చేస్తుందేమో చూడాలి.