అగ్నిపథ్ స్కీం దేశ వ్యాప్తంగా పేరుకు తగ్గట్టే కుంపటి రాజేసింది. గతంలో మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన మోదీ సర్కార్… చివరికి రైతుల సుదీర్ఘ పోరాటానికి తలొగ్గింది. ఇవాళ ఆర్మీ ఉద్యోగాలతో కేంద్ర ప్రభుత్వం గేమ్ ఆడుతోంది. సంస్కరణల పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా నిరుద్యోగుల తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది.
దేశ భక్తి పార్టీగా చెప్పుకునే బీజేపీ పాలిస్తున్న దేశంలో విధ్వంసం వికటాట్టహాసం చేస్తోంది. ఆర్మీ ఉద్యోగుల వేతనాలు, ఇతరత్రా ఖర్చులు భారమవుతున్నాయనే భావనతో మొక్కుబడిగా ఆర్మీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందుకు అగ్నిపథ్ అంటూ అందమైన పేరు పెట్టింది. కేవలం నాలుగు, ఐదేళ్లు ఉద్యోగాలు చేసిన తర్వాత, ఇంటికి వెళ్లమంటే ఏం చేయాలని ఆర్మీ అభ్యర్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సికింద్రాబాద్‌లో అగ్నిపథ్ వ్యతిరేకులు విధ్వంసానికి తెగబడ్డారు. వేలాది మంది యువత రోడ్డెక్కారు. అగ్ని పథ్ నిరసనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మూడు రైళ్లు, 40కిపైగా బైకులను పట్టాలపై తగలబెట్టారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. మరికొన్ని రైళ్లను మౌలాలిలోనే నిలిపివేశారు. ఇంకొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించింది.
వేలాది మంది ఆర్మీ అభ్యర్థులు, నిరుద్యోగులు ఇంకా సికింద్రాబాద్‌లో రైలు పట్టాలపైనే బైఠాయించారు. వాళ్లను బుజ్జగించి, శాంతింపజేయడానికి చర్చలకు రైల్వే అధికారులు ఆహ్వానించారు. కేవలం పది మందిని మాత్రమే చర్చల నిమిత్తం ARO ఆఫీస్‌కు రావాలని పోలీసులు ఆహ్వానం పంపారు. ఆందోళనకారులు మాత్రం పట్టించుకోలేదు. అందరూ వస్తామని, తమ డిమాండ్లను నెరవేర్చాలని పట్టుపట్టారు.
పట్టాలపైనే కూర్చుంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక రైల్వే అధికారులు తలలు పట్టుకున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గాలని రైల్వే ఉన్నతాధికారులు హెచ్చరించినా ప్రయోజనం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ అభ్యర్థుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే తప్ప, ఆగ్రహజ్వాలలు చల్లారేలా లేవు.