సోషల్ మీడియా అనేది ఇవాళ నాయకులకు అంది వచ్చిన అతిపెద్ద అస్త్రం. ఆ వేదికల ద్వారా వారు అనునిత్యం అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తమ సోషల్ వేదికలను చూసే అవకాశం కూడా లేని ప్రజలందరికీ.. పత్రికలు, టీవీ ఛానెళ్లు వారి పోస్టుల గురించి తెలియజెబుతూనే ఉన్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల నాయకులకు ఉండే లాభం ఏంటంటే.. తాము చెప్పదలచుకున్నది ప్రజల్లోకి వెళుతుంది. తమను నిలదీసి అడగడానికి విలేకర్లు ఎవరూ ఉండరు. తద్వారా.. తమ కుతర్కాలు, లోపాలు బయటపడిపోకుండా కాపాడుకోవచ్చు.
కానీ కొన్ని కీలకమైన సందర్భాల్లో కూడా నాయకులు మీడియాతో మాట్లాడకుండా.. వారు మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఎవాయిడ్ చేయడం అనేది ఎలాంటి సంకేతం. అది వారిలోని పలాయనవాదం అనుకోవాలి. సరిగ్గా అలాంటి పలాయనవాదాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ ప్రదర్శిస్తున్నారు. రాహుల్ కోటరీకి చెందిన కాంగ్రెస్ యువనాయకుడిగా దేశవ్యాప్త గుర్తింపు ఉన్న జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడి, భాజపాలో చేరిన ఎపిసోడ్ కు సంబంధించి.. మీడియా పలకరించినప్పుడు రాహుల్ ఏ సమాధానమూ చెప్పకుండా వెళ్లిపోవడం చిత్రంగా కనిపిస్తోంది.
సింధియాకు రాహుల్ అనుచరుడిగా పేరుంది. మధ్యప్రదేశ్ సీఎం చేస్తామనే ఆశపెట్టే.. శాసనసభ ఎన్నికల్లో విపరీతంగా కష్టం చేయించారనే ప్రచారమూ ఉంది. అంత చేసిన తర్వాత.. సీఎం విషయంలో రాహుల్ మాట కూడా చెల్లినట్టు లేదు. కమల్ నాధ్ ను పదవి వరించింది. సింధియా సహజంగానే కినుక వహించారు. ఇక్కడ తప్పంతా, రాహుల్ ఆయనను బుజ్జగించలేకపోవడం. దాంతో ఆ విషయంపై సూటిగా మాట్లాడలేక… ఏదో కడుపుమంట ట్వీట్లు మాత్రమే పెట్టి రోజులు నెట్టేస్తున్నారు.
ఇది రాహుల్ జాడ్యం మాత్రమే కాదు… చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ అందరూ కూడా ట్వీటర్ లో మాట్లాడుతున్నారే తప్ప.. తమను నిలదీయగల ప్రెస్ ముందు మాట్లాడకపోవడం ఘోరం. నాయకులు ఆ పలాయనవాదాన్ని వీడడం అవసరం.