వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ రెచ్చిపోయారు. ఇటీవల తనపై షర్మిల విమర్శలు చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తనపై షర్మిల విమర్శలకు తీవ్రస్థాయిలో అజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌పై షర్మిల ఘాటు విమర్శలు చేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఖమ్మంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. భూకబ్జాలెన్ని చేసినా పువ్వాడకు ధనదాహం తీరలేదని ధ్వజమెత్తారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ఆర్టీసీ పరిస్థితేంటో తెలియదని వెటకరించారు. ఖమ్మం ప్రజలకు మంత్రి పువ్వాడ చేసిందేమీ లేదని షర్మిల విమర్శించారు.
పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ షర్మిలకు సవాల్ విసిరారు. ఉక్కు నుంచి భూముల వరకు అన్ని రకాలుగా కబ్జాలు, దందాలు చేసిన ఘనత మీ కుటుంబానిదే అని షర్మిలనుద్దేశించి విమర్శించారు. మీ తండ్రి (వైఎస్సార్), అన్న (జగన్) పరిపాలనలో జరిగిన అరాచకాలను చూస్తే అరాచకానికే సిగ్గు చేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒట్టి పుణ్యానికే మంత్రి కాకపోతే మీ అన్నలా డబ్బులిచ్చి తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
అన్నతో పంచాయితీ వుంటే ఆంధ్రాలో చూసుకోవాలని షర్మిలకు పువ్వాడ సూచించారు. తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారని ప్రశ్నించడం గమనార్హం. పరిటాల రవిని హత్య చేయించింది మీరే అంటూ ఆయన ఆరోపించారు. దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేసి గెలిచి చూపించు అని సవాల్ విసిరారు. షర్మిల పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతున్న పాలేరులోనూ తన దమ్మేంటో చూపిస్తానని పువ్వాడ సవాల్ విసిరారు.
షర్మిల నిలబడే చోట తాను నిలబడి గెలిచి చూపిస్తానని పువ్వాడ అజయ్ సవాల్ విసిరి వుంటే…. ఇదిరా మొగోడి మాట అని ఎవరైనా ప్రశంసించే వాళ్లని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు విరుద్ధంగా తన వద్దకొచ్చి షర్మిల పోటీ చేయాలని సవాల్ విసరడం ఏంటో? అని మరికొందరు తప్పు పడుతున్నారు. ఇటీవల తాను కమ్మ సామాజిక వర్గం కాబట్టే, ఇబ్బంది పెడుతు న్నారని పువ్వాడ కులాన్ని తెరపైకి తెచ్చి అభాసుపాలయ్యాడు.
తాజాగా పరిటాల రవిని వైఎస్ కుటుంబమే చంపించిందనే ఆరోపణ చేయడం వెనుక, సొంత సామాజిక వర్గ సానుభూతి పొందాలనే రాజకీయ కుట్ర దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను ప్లవర్ కాదు… ఫైర్ అనుకుంటే, దమ్ముంటే షర్మిలపై పోటీ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.