తెలుగు క్లాసిక్ గుండమ్మ కథ వచ్చి ఈ జూన్‌కి 60 ఏళ్లు. సినిమాలో ఎందరు హేమాహేమీలున్నా గుండమ్మ పాత్రని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. గుండమ్మ అన్ని వూళ్లలో కనిపిస్తుంది. జాగ్రత్తగా చూస్తే మన ఇంట్లో కూడా వుంటుంది.
గుండమ్మ పరిచయమే ఆమె ఏంటో తెలియజేస్తుంది. విసురుగా ఇంట్లో నుంచి రావడం, మారుటి కూతురు సావిత్రి మీద అరవడం, “ఆ కోడి కూడా నీలాటిదే పనిలేక కూసుంటుంది” అనడం. అంటే సావిత్రి ఎంత పని చేసినా ఆ ఇంట్లో విలువ లేనట్టే. కూతురు ఎలాగూ కాదు. సావిత్రి సరైన పని మనిషి కూడా కాదు గుండమ్మ దృష్టిలో.
ఈ లక్షణాన్ని ఇప్పటికీ చాలా మందిలో చూడొచ్చు. బాగా చదువుకున్న వాళ్లు కూడా పనిమనిషి శ్రమను గుర్తించరు. ఎంత చేసినా “ఆ ఏదో అరకొరగా చేస్తుంది” అనేస్తారు. ఈ సీన్లో గోడ గడియారం తెల్లవారుజాము 3.15 చూపిస్తుంది. విజయవారి సినిమాల్లో ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటారనడానికి ఇదో ఉదాహరణ.
గుండమ్మ ఇంట్లో పనివాళ్లు పారిపోతారు. ఈ విషయం సావిత్రి చెబితే “నీ చేతి కింద ఎవరు పనిచేస్తారే” అని ఆ తప్పును కూడా ఆమె మీదకే నెడుతుంది.
భర్త పాదరక్షలకి గుండమ్మ పూజ చేసుకుంటుంది. కానీ లోకం మాత్రం ఆమెను మందు పెట్టి మొగున్ని చంపిందని అనుకుంటూ వుంది (రమణారెడ్డి మాటలు). కూతురు పొద్దు పోయే వరకూ నిద్రపోయినా ఆనందించే గుండమ్మ, సవతి కూతురుతో తెల్లారక ముందే చాకిరి చేయిస్తుంది.
గంటయ్య (రమణారెడ్డి) ద్వారా గుండమ్మ క్యారెక్టర్ని పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాడు దర్శకుడు. ఆమెకి ఎంత పేరు అంటే కూతురికి సంబంధాలు కూడా రానంత. నిజానికి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేది గంటయ్యే. జైళ్లో వున్న కొడుకు (రాజనాల)కి చేసుకుని ఆస్తి కొట్టేయాలని అతని ఐడియా.
రామభద్రయ్య పట్నం వచ్చి బంధువుల ఇంటికి (మిక్కిలినేని) వెళితే వాళ్లు కూడా గుండమ్మ పేరు చెప్పి భయపెడతారు. ఆయన (ఎస్వీ రంగారావు) గుండమ్మ ఇంటికి వెళ్లే సరికి బాలకృష్ణ (అంజి) ఆ ఇంట్లో పనిచేస్తే ఏనుగులా వున్న వాడు పీనుగులా అయిపోతాడని గుండమ్మ ఇంట్లోకి కూడా వెళ్లకుండా పారిపోతాడు. అయినా కూడా రామభద్రయ్య ధైర్యంగా వెళ్తాడు.
ఇంట్లో వున్న కాసేపటికే రామభద్రయకి అర్థమవుతుంది. గుండమ్మని, ఆమె కూతురిని (జమున) దారికి తేవాలంటే నాటకం ఆడాలని. అక్కడితో డ్రామా మొదలు.
పనివాడిగా ఎన్టీఆర్ రాగానే అతని బాడీ లాంగ్వేజీని గమనించిన గుండమ్మ “వీడు పనిచేసే వాలకం కాదు ” అని వెళ్లిపొమ్మంటుంది. అంజి విసనకర్రతో సేవలు చేయగానే మెత్తబడుతుంది. పొగడ్తలకి లొంగిపోతూనే వెంటనే కోపం తెచ్చుకునే స్వభావం ఆమెది.
గుండమ్మకి ఆత్మాభిమానం కూడా ఎక్కువే. గయ్యాళి కానీ ఒకరి సొమ్ముకి ఆశ పడదు. జమున ఏఎన్ఆర్ దగ్గర డబ్బులు తీసుకుందని తెలిసి “రేపే వెళ్లి వాళ్ల డబ్బు వాళ్ల మొకాన పారేసి రా” అంటుంది.
గయ్యాళికి ఇంకో గయ్యాళి వుంటేనే సమ ఉజ్జి. అందుకే ఛాయాదేవి రంగ ప్రవేశం. అదెంత గయ్యాళో తాను చూస్తానని అంటుంది. సూర్యకాంతం మీద మనకి కావాల్సినంత కోపం వస్తూ వుంటుంది. సినిమాలో కానీ, జీవితంలో కానీ మనకి ఎవరి మీదైతే కోపం, కసి ఏర్పడుతాయో, వాళ్ల కష్టాలు, పతనం కోసం ఎదురు చూస్తాం. ఇది సైకాలజీ.
ఆ డ్రామా పండితే సినిమా హిట్. చాలా సినిమాల్లో ఈ డ్రామా ఎందుకు పండదంటే విలన్ మీద మనకి బాగా కోపం వచ్చే సీన్స్ క్రియేట్ కాకపోవడం వల్ల.
గుండమ్మ కథలో జమున అహంకారం అణిగినప్పుడు కంటే సూర్యకాంతాన్ని (గుండమ్మ) ఛాయాదేవి చావకొట్టి గదిలో వేయడాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.
తాను ఎవరినైతే కష్టాలు పెట్టిందో (సావిత్రి) ఆ అమ్మాయే రక్షణగా నిలిచి సూర్యకాంతం మర్యాద కాపాడుతుంది.
గుండమ్మ కథని మళ్లీ ఎవరూ ఎందుకు తీయలేకపోయారంటే గుండమ్మ ఇంకా పుట్టలేదు.
60 ఏళ్లుగా తెలుగువాళ్లు తమ ఆడపిల్లలకి సూర్యకాంతం అని పేరు పెట్టుకోడానికి భయపడుతున్నారంటే ఆవిడ ఎంత గొప్ప నటో అర్థమవుతుంది.
జీఆర్ మహర్షి