కాల్పుల్లో ముస్లిం చ‌నిపోయి వుంటే…?

కేంద్ర ప్ర‌భుత్వం అగ్గిరాజేసింది. ‘అగ్నిపథ్‌’ కింద కేవ‌లం స్వ‌ల్ప కాలం మాత్ర‌మే మిల‌ట‌రీలో ఉద్యోగాలు క‌ల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు నిప్పుర‌వ్వ‌ల‌య్యారు. అనేక రాష్ట్రాల్లో రైళ్ల‌ను, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను…

కేంద్ర ప్ర‌భుత్వం అగ్గిరాజేసింది. ‘అగ్నిపథ్‌’ కింద కేవ‌లం స్వ‌ల్ప కాలం మాత్ర‌మే మిల‌ట‌రీలో ఉద్యోగాలు క‌ల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు నిప్పుర‌వ్వ‌ల‌య్యారు. అనేక రాష్ట్రాల్లో రైళ్ల‌ను, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను నిరుద్యోగులు త‌గ‌ల‌బెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ‘అగ్నిపథ్‌’ మంట‌లు తెలంగాణాకు కూడా వ్యాపించాయి. సికింద్రాబాద్ కాల్పుల్లో వ‌రంగ‌ల్‌కు చెందిన ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ యువకుడు రాకేష్‌గా పోలీసులు గుర్తించారు. అలాగే ప‌లువురు యువ‌కులు గాయాల‌పాల‌య్యారు. ఈ విధ్వంసానికి బీజేపీ త‌న మార్క్ భాష్యం చెబుతోంది. సికింద్రాబాద్‌లో రైల్వే బోగీలు తగులబెట్టడం, విధ్వంసాలు సృష్టించడంలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని తెలంగాణ‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 

శుక్రవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారని విరుచుకుప‌డ్డారు.  

భారీ విధ్వంసం జరుగుతున్నా నియంత్రించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని బండి సంజ‌య్‌ విమర్శించారు. అగ్నిపథ్‌కు ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయ‌న విమ‌ర్శించారు. విధ్వంసంతో ఆర్మీ విద్యార్థుల‌కు సంబంధం లేద‌న‌డం, అలాగే టీఆర్ఎస్‌, ఎంఐఎం గూండాలున్నార‌ని బండి సంజ‌య్ ఆరోపించ‌డం వెనుక అస‌లు ఉద్దేశం ఏంటో బ‌య‌ట‌ప‌డింది. 

ఒక మ‌తానికి చెందిన యువ‌త విధ్వంసానికి పాల్ప‌డ్డార‌నేది బండి సంజయ్ ఆరోప‌ణ‌ల సారాంశం. పోలీసుల కాల్పుల్లో రాకేష్ అనే హిందూ యువ‌కుడు చ‌నిపోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ ముస్లిం యువ‌కుడు చ‌నిపోయి వుంటే… రాజ‌కీయాన్ని మ‌తం కోణంలో బీజేపీ న‌డిపి వుండేది. ఆ ప్ర‌మాదం త‌ప్పింది. అగ్నిప‌థ్‌పై ఇప్ప‌టికీ బీజేపీ వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.