మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పుణ్యమా అని దేశమంతా తగలబడుతోంది. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత రైళ్లను, ఇతరత్రా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి దిగింది. ఈ ఆందోళన ఇవాళ తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించింది. సికింద్రాబాద్‌లో రైళ్లపై రాళ్లు రువ్వడం, అలాగే హైదరాబాద్‌లోని పలు రైల్వేస్టేషన్లలో రైళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురం కొందరు విధ్వంసానికి తెగబడ్డారు. ఆ ఘటన వెనుక అధికార పార్టీ హస్తం వుందని జనసేన, టీడీపీ, బీజేపీ తదితర ప్రతిపక్షాలన్నీ విమర్శించాయి. మరి దేశ వ్యాప్తంగా సాగుతున్న విధ్వంసకాండకు ఎవరు బాధ్యత వహించాలి. నిరుద్యోగ యువత ఒక్కసారిగా చెలరేగిపోయి, సహనం కోల్పోయి రైళ్లను తగలబెట్టే వరకూ వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఈ విధ్వంసంపై జాతీయపార్టీ టీడీపీ ఎందుకు స్పందించడం లేదు. అలాగే బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత దేశ వ్యాప్తంగా నిరసనల వెనుక ఎవరున్నారో ఎందుకు చెప్పడం లేదు. మొక్కుబడి ప్రకటనతో పవన్‌కల్యాణ్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. సికింద్రాబాద్‌లో ఈ రోజు చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమని పవన్‌కల్యాణ్ అన్నారు.
అగ్నిపథ్ పథకంపై చేపట్టిన నిరసనల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలు ఆవేదన కలిగించాయన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. అలాగే మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.
రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటున్న చందంగా… ఏపీ ప్రతిపక్ష నేతల స్పందన వుంది. మనకు నచ్చని పాలకులు వుంటే, నిజానిజాలతో సంబంధం లేకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం పవన్‌కల్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
అమలాపురంలో విధ్వంసంపై ఒక రకంగా, ఇదే దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న అరాచకాల గురించి కాకుండా, కేవలం దురదృష్టకరం అంటూ పవన్ స్పందించడం ఆయనకే చెల్లిందని దుయ్యబడుతున్నారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆగ్రహం హెచ్చరిల్లడానికి మోదీ పాలనా విధానాలే కారణమని తెలిసినా, ప్రశ్నించలేని దయనీయ స్థితి ఏపీ ప్రతిపక్ష పార్టీలది.