రాజమండ్రి అర్బన్, రూరల్ అంటూ రెండు నియోజకవర్గాలయ్యాక బుచ్చయ్య చౌదరికి సిటీపైనే మనసుండేది. కానీ చంద్రబాబు ఆయన్ను రూరల్ కి పరిమితం చేశారు. ఆమధ్య ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి కారణం కూడా సిటీపై పెత్తనం తగ్గిపోయిందనే. కానీ అక్కడ కింజరపు వారింటి అడపడుచు భవానీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
బుచ్చయ్యను రాకుండా భవానీ కుటుంబీకులు అడ్డుకుంటున్నారు. తాజాగా భవానీ భర్త ఆదిరెడ్డి వాసు వచ్చే ఎన్నికల్లో సిటీ సీటు నాదేనంటూ తేల్చి చెప్పారు. ఇక బుచ్చయ్యకు డోర్స్ క్లోజ్ అనే చెప్పాలి.
సీనియర్లకు మంగళం..
బుచ్చయ్య లాంటి సీనియర్లకు ఎప్పుడో మంగళం పాడేయాల్సిందే. కానీ స్థానికంగా కొత్త నాయకత్వాన్ని ఎదగనీయకుండా వారు చేసిన ప్రయత్నాలే ఇప్పటికీ అలాంటి వారికే సీటు రావడానికి కారణం అయ్యాయి. రాజమండ్రిలో పెత్తనమంతా తానే తీసుకున్నా.. సిటీ, రూరల్ రెండుగా విడిపోయిన తర్వాత అనివార్యంగా సిటీలో మరో కుటుంబానికి చోటివ్వాల్సి వచ్చింది. అక్కడ ఆదిరెడ్డి కుటుంబం పాగా వేసింది.
ఇక మహిళా కోటాలో, ఎర్రన్నాయుడు కుమార్తె అనే సెంటిమెంట్ తో అక్కడ భవానీకి టికెట్ ఇచ్చారు చంద్రబాబు, ఆమె సిటీ నుంచి గెలిచి తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. టీడీపీలో చంద్రబాబు గెలిచి లోకేష్ ఓడిపోయారు కానీ… కింజరపు కుటుంబం తరపున అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, భవానీ.. ముగ్గురూ చట్ట సభలకు ఎన్నికై సత్తా చాటారు. ఇక ఇప్పుడు రాజమండ్రి సిటీ సీటు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బుచ్చయ్యను కాదని, ఆ సీటు తనదేనంటూ ప్రకటించుకున్నారు భవానీ భర్త ఆదిరెడ్డి వాసు.
ఇప్పుడేం చేస్తారు..?
గతంలో సిటీపై పెత్తనం తగ్గిందనే కారణంతో బుచ్చయ్య రాజీనామా డ్రామా ఆడారు. ఇప్పుడు సిటీ సీటు నాదేనంటూ వాసు ప్రకటించుకున్నారు. ఇప్పుడిక బుచ్చయ్య భవిష్యత్ ఏంటో ఆయనే తేల్చుకోవాలి. సిటీలో తాను అడుగు పెట్టి, రూరల్ తన మాట వినేవారికి ఇప్పించుకుని రెండు చోట్లా తనదే పెద్దనం అనేలా చూసుకోవాలనేది బుచ్చయ్య ఆలోచన. కానీ అది నెరవేరేలా లేదు.
ముందుగానే ఆదిరెడ్డి ఫ్యామిలీ నుంచి బుచ్చయ్యకు సెగ తగులుతోంది. అందులోనూ వచ్చే ఎన్నికల్లో యువతకే ప్రాధాన్యం అంటూ చంద్రబాబు ముందునుంచీ హింట్ ఇస్తున్నారు కాబట్టి.. షెడ్డుకెళ్లిపోయే బండ్లను ఆయన పెద్దగా పట్టించుకోరని తెలుస్తోంది. సో.. రాజమండ్రిలో బుచ్చయ్య రాజకీయం ముగిసినట్టే అనుకోవాలి.