గన్నవరం లోకల్ రాజకీయాల్లో భాగంగా వైసీపీలోనే ఇద్దరు నేతలకు పడటంలేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ దశలో ఇటీవల నువ్వు విలన్ వి అంటే.. నువ్వేమైనా మహేష్ బాబువా అంటూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు.
కథ ఇక్కడితో ఆగలేదు. ఇది అటు ఇటు తిరిగి జనసేనకు చుట్టుకుంది. జనసేన నాయకులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారుని అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద వంశీ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏం జరిగింది.. జనసేనకు ఎందుకు కోపమొచ్చింది.
వల్లభనేని వంశీ.. యార్లగడ్డ వెంకట్రావుని విమర్శించే క్రమంలో మధ్యలో జనసేన టాపిక్ తీసుకొచ్చారు. ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో యార్లగడ్డ.. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పడం వంశీ ఉద్దేశం. అయితే ఇందులో పరోక్షంగా జనసేనని కూడా ఆయన టార్గెట్ చేసినట్టయింది.
యార్లగడ్డ వర్గీయులు స్థానిక ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను ఓడించారని, అందుకోసం జనసేన నేతలకు డబ్బులిచ్చి మరీ మోసం చేశారనేది వంశీ ఆరోపణ. దీంతో జనసేన నాయకులకు పొడుచుకొచ్చింది. వంశీ క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు.
యార్లగడ్డ టీడీపీ మాజీ స్టూడెంటేనంటూ ఇటీవలే వల్లభనేని వంశీ విమర్శించారు. ఆ తర్వాత జనసేనతో కూడా ఆయనకు సంబంధాలున్నాయని, జనసేన నేతల్ని కూడా వాడుకుని ఆయన సొంత పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. దీంతో ఈ గొడవ అటువైపు టర్న్ తీసుకుంది. చివరకు జనసేన నేతలు వంశీ కారుని అడ్డుకుని రచ్చ చేయడంతో, కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదేనేమో.. ఇప్పటివరకూ వంశీ వర్సెస్ వెంకట్రావ్ మధ్య ఉన్న గొడవ కాస్తా.. ఇప్పుడు వంశీ వర్సెస్ సైనిక్స్ గా మారింది. రాబోయే రోజుల్లో ఈ ముక్కోణపు గొడవ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.