ఆడవాళ్ల కాస్మటిక్స్‌కి పేరుగాంచిన రెవ్లాన్ (REVLON) కంపెనీ దివాళా తీసింది. అమెరికాలో పుట్టి, మారుమూల మన వూళ్లలో కూడా కనిపించే రెవ్లాన్ మునిగిపోడానికి కారణం ఆన్‌లైన్ షాపింగ్ సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం.
ప్రస్తుతం ట్రెండ్ ఏమంటే పాత పద్ధతుల్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్లంతా మునిగిపోతారు. పెద్ద బట్టల షాపు పెట్టి, ఒక కుర్రాడు బట్టలన్నీ కుప్ప పోసి, గజం బద్దతో కొలిచి, కత్తెరతో కట్ చేసే వ్యాపారుల్లో సగం మంది ఇప్పటికే దివాళా తీశారు. ఆన్‌లైన్ షాపింగ్, యూట్యూబ్ పబ్లిసిటీ వుంటే పెద్ద పెట్టుబడి లేకపోయినా కస్టమర్లని ఆకర్షించొచ్చు. ఇది తెలియకుండా కోట్లు ఖర్చు పెట్టి థియేటర్లు, టీవీల్లో యాడ్‌లు ఇచ్చే కంపెనీలన్నీ రెవ్లాన్ దారిలో నడవాల్సిందే.
రెవ్లాన్ అంటే అమెరికాలో చరిత్ర. ప్రపంచంలోనే ఒక బ్రాండ్. కానీ ఇది ఏం చేసిందంటే పెద్దపెద్ద షాపులు పెట్టి కస్టమర్లే తన దగ్గరికి రావాలని అనుకుంది. పోటీదారులు రిహన్నా, కిలిజెన్నెర్ లు ఏం చేశాయంటే కస్టమర్ల దగ్గరికి తామే వెళ్లాయి. 90 ఏళ్ల చరిత్ర వున్న రెవ్లాన్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మార్పుల్ని అర్థం చేసుకోలేక పోయింది.
సోషల్ మీడియా సూపర్‌స్టార్స్‌తో ప్రచారం, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లను ప్రత్యర్థులు సక్సెస్‌ఫుల్‌గా వాడి బ్రాండ్స్‌ని ప్రచారం చేస్తుంటే రెవ్లాన్ పాత పద్ధతులనే నమ్ముకుంది. దీనికి తోడు కరోనాతో ప్రపంచ మార్కెట్లు దెబ్బతినడంతో రెవ్లాన్ చేతులెత్తేసింది.
ప్రస్తుతం కంపెనీకి 3.8 బిలియన్ డాలర్లు అప్పు, 5,700 ఉద్యోగులున్నారు. 2020లో 1000 మంది ఉద్యోగుల్ని తీసేశారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం లక్షణాలు కనిపిస్తున్నాయి. జనం డబ్బు ఖర్చుకి భయపడుతున్నారు. కాస్మటిక్స్ ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్లిపోతోంది.
1990లో పీక్స్‌కి వెళ్లిన రెవ్లాస్ అందరూ చేసే తప్పుల్నే తానూ చేసింది. అప్పులు చేసి కొన్ని కంపెనీలని కొనింది. అప్పులు కొండలాగా పెరిగాయి. చివరికి దివాళాకి చేరింది.