తుపాకీ ప‌ట్టిన వాడు ఊరికే వుంటాడా?

“అగ్నిప‌థ్” పై దేశ‌మంతా ఆగ్ర‌హంతో ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌కు నిప్పు పెట్టే వ‌ర‌కూ వ‌చ్చింది. యువ‌త రోడ్డు మీద‌కి వ‌చ్చింది. దీనికి కార‌ణం వాళ్ల ఆశ‌ల‌న్నీ మిల‌ట‌రీ ఉద్యోగాల‌పైనే. యువత ఎక్కువ‌గా సైన్యంలో చేరాల‌ని…

“అగ్నిప‌థ్” పై దేశ‌మంతా ఆగ్ర‌హంతో ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌కు నిప్పు పెట్టే వ‌ర‌కూ వ‌చ్చింది. యువ‌త రోడ్డు మీద‌కి వ‌చ్చింది. దీనికి కార‌ణం వాళ్ల ఆశ‌ల‌న్నీ మిల‌ట‌రీ ఉద్యోగాల‌పైనే. యువత ఎక్కువ‌గా సైన్యంలో చేరాల‌ని స‌న్న‌ద్ధం అవుతూ వుంటుంది. అస‌లే రెండేళ్లుగా కోవిడ్ వ‌ల్ల రిక్రూట్‌మెంట్ లేదు. ఈ సారి భారీగా వుంటుంద‌ని ఆశ‌ప‌డితే కొత్త స్కీం తెచ్చి అగ్ని వీరులు అని బిరుదు త‌గిలించారు.

దీని వ‌ల్ల న‌ష్టం ఏమంటే వాళ్ల‌కి 30 నుంచి 40 వేలు జీతం ఇస్తారు. దాంట్లో మూడో వంతు కార్ప‌స్ ఫండ్‌కి మ‌ళ్లిస్తారు. అంటే వాళ్ల‌కి నెల‌కి 20 వేల‌కి మించి చేతికి రాదు. ఆరు నెల‌ల శిక్ష‌ణ త‌ర్వాత నాలుగేళ్లు మాత్ర‌మే స‌ర్వీస్‌లో వుంటారు. 75 మందిని బ‌య‌టికి పంపి, 25 శాతం మందిని ప‌ర్మినెంట్ చేస్తారు. రిటైర్ అయ్యే నాటికి వాళ్ల డ‌బ్బుకి అద‌నంగా గ‌వ‌ర్న‌మెంట్‌ది క‌లిపి గ‌ట్టిగా రూ.11 ల‌క్ష‌లు వ‌స్తుంది. 2026 నాటికి అదేం పెద్ద మొత్తం కాదు. ఇంకే బెన్‌ఫిట్స్ వుండ‌వు.

అంటే 40 వేల మంది సైనిక శిక్ష‌ణ పొంది సొసైటీలోకి వ‌స్తారు. వాళ్ల‌కి సెక్యూరిటీగార్డులు, బౌన్స‌ర్లు ఇలాంటి జాబ్స్ త‌ప్ప ఇంకేమీ రావు. ఒక‌వేళ 30 వేల మందికి ఉపాధి ల‌భించినా 10 వేల మంది తుపాకీ ప‌ట్ట‌డం తెలిసిన వాళ్లు నిరుద్యోగులుగా మ‌న మ‌ధ్య వుంటారు. నిరాశ‌నిస్పృహ‌ల‌తో వీళ్లు నేర‌స్తులుగా మారితే, ఇప్ప‌టికే సంక్షోభంలో వున్న వ్య‌వ‌స్థ ఇంకా అధ్వాన్నంగా మారుతుంది.

నిజానికి ఈ స్కీం కొత్త‌దేం కాదు. అమెరికాలో ఆల్రెడీ వుంది. అక్క‌డ మాజీ పార్ట్ టైం సైనికులు నేర‌స్తులుగా మారిన‌ట్టు అనేక నివేదిక‌లు చెప్పాయి. ఫ‌స్ట్ వ‌రల్డ్ వార్ త‌ర్వాత మ‌న సైనికులు చాలా మందిని బ్రిటీష్ ప్ర‌భుత్వం అర్ధాంతరంగా వ‌దిలించుకుంది. దాని ఫ‌లిత‌మే 1919 పంజాబ్ అల్ల‌ర్లు.

సైన్యంపై ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌ని మోదీ, స‌మాజంపై భారాన్ని మోపుతున్నాడు.