వచ్చే ఎన్నికల్లో గెలుపు తధ్యం కాబోయే సీఎం నేనే అంటూ జిల్లా టూర్లో ఊరూ వాడా తిరుగుతూ చంద్రబాబు జబ్బలు చరుస్తున్నారు. గట్టిగా మాట్లాడుతున్నారు. నన్ను ఆపతరం ఎవరితరం అంటూ కూడా పెద్ద సవాల్ చేస్తున్నారు. ఏపీలో జగన్ పని అయిపోయింది అని కూడా ధీమాగా చెప్పుకుంటున్నారు.
అలాంటి బాబు గాలిని తీసేశారు వైసీపీ యువ మంత్రి గుడివాడ అమరనాధ్. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతలా ప్రయాసపడినా జగన్ ముప్పయ్యేళ్ల సీఎం. మూడు దశాబ్దాల పాటు ఆ కుర్చీలో ఆయనే ఉంటారు. కదిపేది లేనే లేదని తేల్చిచెప్పారు.
ఇక వచ్చే ఎన్నికల్లో అధికారమని తెగ ఆయాసపడుతున్న టీడీపీ అధినాయకత్వానికి చేదు వార్తను వినిపించారు ఆయన. మీకు ఈసారి వచ్చిన 23 సీట్లు కూడా వచ్చేసారి రావు. ఇంకా తగ్గిపోతాయి. జాగ్రత్త సుమా అని సున్నితంగా హెచ్చరించారు గుడివాడ.
జగన్ సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున చేస్తున్నారని, హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని ఇలాంటి సీఎం ని జనాలు ఎప్పటికీ వదులుకోరని, కాబట్టి టీడీపీ మళ్ళీ మళ్లీ నిరాశ తప్పదని గుడివాడ చెప్పాల్సింది చెప్పేసారు. ఈ విషయంలో రెండవ ఆలోచనలు ఏవీ పెట్టుకోమాకండి అని కూడా కూడా తేల్చేశారు.
మరి ఏడు పదులు దాటిన ముదిమి వయసులో బాబు ఎంతో ప్రయాసపడుతూ పల్లెలన్నీ పట్టి తెగ తిరుగుతుంటే మీకు రేపటి ఎన్నికల్లోనే కాదు మరో అయిదారు ఎన్నికల దాకా గుండు సున్నావే అని గుడివాడ చెబితే ఎలా ఉంటుంది. తన సభలకు జనాలు బాగా వచ్చారు అని సంతోషిస్తున్న బాబుకు తమ్ముళ్ళకు ఈ మాటలతో గాలి తీసేసినట్లుగా ఉందిట.
అయినా గుడివాడ చెప్పిన దాంటో ఒక లాజిక్ పాయింట్ ఉంది. అది టీడీపీని కూడా కలవరపెడుతున్న అంశమే. ఇన్నేసి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం ఎవరైనా వదులుకుంటారా అన్నదే లాజిక్ పాయింట్. దీని మీద టీడీపీ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే సుమా.