Advertisement

Advertisement


Home > Movies - Reviews

Virata Parvam Review: మూవీ రివ్యూ: విరాటపర్వం

Virata Parvam Review: మూవీ రివ్యూ: విరాటపర్వం

టైటిల్: విరాటపర్వం
రేటింగ్: 2.5/5
తారాగణం: సాయిపల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, జరీన వాహెబ్, రాహుల్ రామకృష్ణ, బెనెర్జీ, నందితా దాస్, ఈశ్వరీరావు తదితరులు
కెమెరా: డాని సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు: సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం: వేణు ఉడుగుల
విడుదల తేదీ: 17 జూన్ 2022

"విరాటపర్వం" అనగానే వెంటనే గుర్తొచ్చేది మహాభారతంలోని ఆసక్తికరమైన ఘట్టం. అత్యంత పరాక్రమవంతులైన పాండవులు విరాటరాజు అనబడే ఒక చిన్న రాజు కొలువులో మారువేషాల్లొ తలదాచుకుంటారు.

కనుక ఆ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో ఆ తరహా కథనమేదైనా ఉంటుందేమో అనిపించడం సహజం.

అదలా ఉంచితే ఎప్పుడో 2018 నుంచి వినిపిస్తున్న టైటిలిది. నక్సల్ బ్యాక్ డ్రాప్ అని ముందే చెప్పేసారు. 2019 జూన్లో షూటింగ్ మొదలయ్యి అగ్రభాగం పూర్తయినా, 2020 మార్చ్ నుంచి కరోనా అడ్డుపడింది. ఇక అక్కడినుంచి మందకొడిగా సాగి ఎట్టకేలకి నేడు విడుదలయ్యింది.

సాధారణంగా ఈ సబ్జెక్ట్ తో వచ్చే సినిమాలు ఇప్పటి ప్రేక్షకుల మనసులకి అందడం లేదు. కారణమేంటంటే ప్రస్తుత సినీరాజపోషకులైన 16-25 వయసుల మధ్య ప్రేక్షకులకి అసలు నక్సల్ ఉద్యమం నాటి స్థితిగతులు, ఆ ఉద్యమం ఎందుకొచ్చింది అనే నేపథ్యం తెలియదు. ఒక చరిత్రపాఠంలాగ అదంతా చెప్పుకొస్తే తప్ప కనెక్ట్ కావడం కష్టం.

అయినప్పటికీ ట్రైలర్ ఆకట్టుకుంది. సాయిపల్లవి పాత్రదే సింహభాగమని కూడా అర్థమయింది. "నీది నాది ఒకే కథ" వంటి సెన్సిబుల్ సినిమాని తీసిన మంచి టేస్టున్న దర్శకుడు వేణు ఉడుగుల. దాంతో సినిమాపై ఇంకొన్ని అంచనాలు పెరిగాయి.

1990ల నాటి ఒక యదార్థ జీవితచరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఇది అని ప్రకటించారు. ఇందులో సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్ర నిజజీవితంలో సరళ అనే ఉద్యమకారిణి కథనుంచి స్ఫూర్తి పొందిందే అని దర్శకుడు తెలిపాడు. ఆ సరళ కుటుంబసభ్యులను సాయిపల్లవి కలవడమనే ఘట్టం కూడా ఈ చిత్ర ప్రొమోషన్ కి ఉపయోగపడింది.

ఈ బ్యాక్ గ్రౌండంతా పక్కనపెట్టి సినిమాలో ఏముందో, ఎంతవరకూ ప్రేక్షకుల ఆసక్తిని వశపరుచుకుందో చూద్దాం.

ఇది నిజంగా భావోద్వేగభరితమైన కథ. 1990-92 కాలంలో సరళ అనే ఒక నక్సల్ ఉద్యమకారిణిని నక్సలైట్లే కాల్చి చంపేసారు. అది అప్పట్లో చర్చనీయాంశమయింది. అదే కథని స్ఫూర్తిగా తీసుకుని సరళ పేరుని వెన్నెలగా మార్చి తీసిన సినిమా ఇది. 

నక్సల్ నాయకుడు రవన్న కవిత్వానికి ఉత్తేజితురాలౌతుంది వెన్నెల. అతన్ని ఇష్టపడుతుంది. కలవాలనుకుంటుంది. కానీ రవన్న నక్సల్ నాయకుడు కనుక అతనిని కలవడం అంత తేలిక కాని విషయం. మొత్తానికి రకరకాల మార్గాలు అన్వేషించి ఆమె రవన్నని కలవడం, అతనితో జీవితం కొనసాగించాలంటే తాను కూడా నక్సల్ ఉద్యమంలో భాగం కావడం తప్ప మరొక దారి లేకపోవడం ఈ కథలో ప్రధాంశాలు. 

అయితే పైన చెప్పుకున్నట్టు విరాటపర్వం టైటిల్ కి జస్టిఫికేషనైతే ఇందులో కనిపిస్తుంది. పూర్తిగా వివరిస్తే సస్పెన్స్ లీకయ్యే అవకాశముంది కనుక ఇక్కడ దాని జోలికి వెళ్లట్లేదు. 

కథలో లోపం లేదుకానీ కథనంలో జాగ్రత్తలు తక్కువ తీసుకున్నట్టయింది. మరీ ముఖ్యంగా ప్రధమార్థంలోని ల్యాగులు, రిపీట్ సీన్స్ పేస్ కి అడ్డొస్తుంటాయి. అయితే సాయిపల్లవి తన నటనతో ప్రేక్షకులకి విసుగు తెప్పించకుండా కూర్చోబెట్టగలిగింది. 

ఈ చిత్రంలో సంభాషణలు గుర్తుపెట్టుకునే లాగ, కొన్ని మనసుకు హత్తుకునేలాగ ఉన్నాయి. ఒక రకంగా సాయుధ నక్సల్ పోరాటం మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి.

‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’..అనే డయాలగ్ ఒక నిదర్శనం.

‘రక్తపాతం లేనిదెప్పుడు చెప్పు​.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది’..అనే వాక్యం ఒక కొటేషన్ స్థాయిలో ఉంది. 

రవన్న దళాన్ని పోలీసుల నుంచి కాపాడే సన్నివేశంలో కావొచ్చు, అతనిపై ఆమె ప్రేమను కళ్లల్లో పరలికించిన తీరు కావొచ్చు సాయిపల్లవి చాలా బాగా చేసింది. 

కథ మొత్తం సాయిపల్లవి మీదే నడుస్తుంది. ఆమె నటన ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది. వెన్నెలగా గుర్తుండిపోయే ప్రతిభ కనపరచింది. భావోద్వేగాల్ని బాగా పండించింది. 

రానా దగ్గుబాటి రవన్న పాత్రలో ఒదిగిపోయాడు. కనిపించినంతసేపూ ఉందాగా, గంభీరంగా ఉన్నాడు. అయితే సాయిపల్లవి పాత్ర, నటన రానాని మింగేసిందనే చెప్పాలి.

సాయిపల్లవి బావగా రాహుల్ రామకృష్ణ, తల్లిదండ్రులుగా ఈశ్వరీరావు, సాయిచంద్, ప్రొఫెసర్ గా నందిత దాస్, మరొక కీలకమైన మలుపు తిప్పే పాత్రలో ప్రియమణి తమతమ పరిధుల్లో చక్కని ప్రతిభ కనబరిచారు. 

టెక్నికల్ గా చూసుకుంటే నక్సల్ ఉద్యమ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కొన్ని పొయెటిక్ సింబాలిక్ షాట్స్ కూడా దర్శకుడి అభిరుచి మేరకు కనిపించాయి.

రన్ టైం ఇబ్బంది పెట్టకపోయినా ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. 

రవన్నకి, తల్లికి మధ్యలోని సన్నివేశాలు హత్తుకుంటాయి. కరడుగట్టిన నక్సల్ నాయకుడి మానవసంబంధాలకి అద్దంపట్టేలా ఉన్నాయి ఆ సీన్స్. 

అలాగే ఇటు నక్సల్స్ కి అటు పోలీసులకి మధ్యన నలుగుతున్న వెన్నెల పాత్ర ఉత్కంఠని కలిగిస్తుంది. ఆనాటి కోవర్ట్ పాలిటిక్స్ ని పరిచయం చేసే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. 

ఏది ఏమైనా దర్శకత్వపరంగా మరింత ఎమోషన్ గ్రాఫ్ ని పెంచే అవకాశమున్నా విన్నింగ్ పాయింట్ కి ఇవతలే ఆగినట్టుంది. 

ఎందుకంటే...వెన్నెల పాత్ర చనిపోతున్నప్పుడు ప్రేక్షకుడు కన్నీటిపర్యంతమయ్యే ఎమోషన్ ని పండించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అదొక్కటీ జరిగున్నా ఈ చిత్రం పైస్థాయికి వెళ్లుండేది.

కథకి ఒక పొయెటిక్ జస్టిఫికేషన్ ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ ఎమోషన్ పండిచడంలో కూడా కేంద్రీకృతమయ్యుంటే ఫలితం మరోలా ఉండేది.

కారణం...సినిమాకి కావాల్సింది లాజిక్ కంటే ఎమోషనల్ మేజిక్. సరైన కథ చేతిలో ఉన్నా మనసుల్ని పిండే అవకాశమున్నా ఆ దిశగా దర్శకుడు వెళ్లలేకపోయాడు. 

బాటం లైన్: ఇంకా బాగుండొచ్చు

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను