పరువు నష్టం దావాలు అనేవి తమ వ్యతిరేకులు నిజంగానే పరువుకు భంగం కలిగించేలా మాట్లాడినప్పుడు వేసే పిటిషన్లుగా గతంలో ఉండేవేమో మనకు తెలియదు. కానీ వర్తమాన రాజకీయాలలో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి, వారి మాటలకు- తమకు నచ్చిన భాష్యాలు చెబుతూ ఇరుకున పెట్టడానికి వాడుకునే న్యాయపరమైన ఆస్త్రాలుగా తయారవుతున్నాయి.
ఒకరిని చూసి మరొకరు రాజకీయ ప్రత్యర్థుల మీద పరువు నష్టం దావాలకు ఉత్సాహపడుతున్నారు. ఆ రకంగా వారిని చికాకు పెట్టవచ్చునని అనుకుంటున్నారు.
‘తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద విమర్శలు చేసినందుకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేస్తాం’ అని శాసనసభ సాక్షిగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రేవంత్ మాటల్లో సంస్కారం ఉండడం లేదని, 70 ఏళ్ల వయసున్న- రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గురించి ఉరివేసి రాళ్లతో కొట్టమంటారా? అని ప్రశ్నిస్తూ ఆ వ్యాఖ్యలే పరువు నష్టం కలిగించినట్లుగా కేటీఆర్ భావిస్తున్నారు.
కేటీఆర్ మాటలను గమనిస్తే ఆయనకు గురివింద గింజ నీతిని గుర్తు చేయాలని అనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకుడు- ప్రభుత్వ అధినేతను విమర్శించి రాళ్లతో కొట్టి ఉరితీయాలని అనడం సమంజసం కాకపోవచ్చు కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను ఎన్నెన్ని రకాలుగా ఇంతకంటే ఘోరమైన పదజాలంతో తూలనాడారో కేటీఆర్ కు గుర్తువస్తుంది. అవన్నీ మరిచిపోయి ఇప్పుడు రేవంత్ మాటల మీద పరువు నష్టం దావా వేస్తానని డాంబికపు ప్రకటనలు చేస్తున్నారు ఆయన.
పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడడం, దానివలన ఆయన తన ఎంపీ సభ్యత్వాన్ని కూడా కోల్పోవడం, శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తే ఆరేళ్లపాటు ఎన్నికలకు దూరం కావడం అనే పరిణామాలు మిగిలిన అందరూ రాజకీయ నాయకులకు ఉత్సాహం ఇస్తున్నట్లుగా ఉంది.
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ పై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కళ్యాణ్ కూడా క్రిమినల్ పరువు నష్టం దావాని ఎదుర్కొంటున్నారు. అందులో ఆయనకు కూడా శిక్షపడే అవకాశం ఎక్కువ అని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ మీద చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి మీద కూడా పరువు నష్టం దావా వేస్తామని అనడం అత్యుత్సాహంలాగా కనిపిస్తోంది. కేటీఆర్ నిజంగానే దావా వేస్తారో ? లేదా, సభారంజకంగా ఉండడానికి అలాంటి మాటలు మాట్లాడారో వేచిచూడాలి.