కుప్పం నియోజకవర్గ బాధ్యతల్ని చూసుకోడానికి చంద్రబాబునాయుడు నియమించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌పై స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
చంద్రబాబు పీఏ మనోహర్ బాధ తప్పిందని అనుకుంటే, ఆయనకు మించి ఎమ్మెల్సీ శ్రీకాంత్ తయారయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతంతో సంబంధం లేని, ఇక్కడి సమస్యల గురించి అవగాహన లేని కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం బాధ్యతలు అప్పగించడం ఏంటనే ప్రశ్న వారి నుంచి వస్తోంది.
వైనాట్ 175 నినాదంతో వైఎస్ జగన్ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్‌లతో పాటు కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు పీఏ మనోహర్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ పార్టీ బాధ్యతలను కొంత మేరకు చూస్తున్నారు.
అయితే తరచూ చంద్రబాబు పర్యవేక్షణ వుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త కృష్ణుడు కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పంలో దింపారు. ఈయన గత రాయలసీమ తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. స్వస్థలం ప్రకాశం జిల్లా. రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడంతో ఇక కుప్పంలోనూ ఏదో సాధిస్తారని ఆయన్ను చంద్రబాబు నియమించారు.
స్థానికంగా తమపై పెత్తనం చెలాయిస్తూ పార్టీ బలహీనపడడానికి కంచర్ల శ్రీకాంత్ కారణం అవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్‌ను కొనసాగిస్తే మరోసారి కుప్పంలో టీడీపీ దెబ్బతింటుందని వారి ఆవేదన. మరి చంద్రబాబు పట్టించుకుంటారో, లేదో చూడాలి.