జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నియామ‌కంపై ప్ర‌శంస‌లు!

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అత్యున్నత సంస్థకు నూతన చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నియామ‌క నిర్ణ‌యం ప్ర‌శంస‌నీయం.…

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అత్యున్నత సంస్థకు నూతన చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నియామ‌క నిర్ణ‌యం ప్ర‌శంస‌నీయం. టీటీడీ చైర్మన్‌గా భూమన నియామకం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం.

ఎందుకంటే…

టీటీడీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ అధికారం. ఒక వ్యక్తి నియామకం వల్ల ఆ సంస్థకు జరిగే మంచి చెడులు ఆధారంగానే ఆహ్వానించడం లేదా వ్యతిరేస్తుంటారు. నా దృష్టిలో భూమన నియామకం టీటీడీకి సంస్థ ప్రయోజనాలు, ఉద్యోగుల సంక్షేమం, తిరుపతి అభివృద్ధి కోణంలో  ఆహ్వానించ‌ద‌గ్గ‌ది.

టీటీడీ చైర్మ‌న్‌గా విశాల దృక్పథంతో నిర్ణయాలు

భూమన టీటీడీ చైర్మ‌న్‌గా ఎలా ఉంటార‌నే ప్ర‌శ్న‌కు గతంలో వారి నిర్ణయాలే ప్రామాణికం. భూమన చైర్మన్‌గా పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు విశాల దృక్పథంతో  భక్తుల ప్రయోజనాలను ప్రాతిపదికన తీసుకున్నవే. నందమూరి తారకరామారావు  నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేశారు. నాడు భక్తులు నిత్య అన్నదానంలో భోజనం చేయాలంటే శ్రీవారి దర్శనం త‌ప్ప‌క చేసుకోవాల్సి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి నేడు తిరుమలలో శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా ప్రతి భక్తుడు నిత్య అన్నదానంలో భోజనం చేసేలాగా పథకాన్ని రూపొందించింది భూమనే. 

నేడు టీటీడీ ట్రస్టులలో అత్యధిక నిధులు కలిగిన వ్య‌వ‌స్థ‌గా నిత్య అన్నదాన ట్రస్టు నిలిచింది. తిరుమలలో క‌ళ్యాణోత్స‌వం జరుపుకోవడం భక్తుల కోరిక. ఆ కార్యక్రమాన్ని విస్తృత పరిచి పేదవాడి ముంగిట్లో కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించేలా గొప్ప నిర్ణయం ఆయ‌న‌ కాలంలోనే జరిగింది. దళిత గోవిందం లాంటి సాహసోపేత నిర్ణయాలు భూమ‌నకు మాత్ర‌మే సొంతం. అలా భూమన నేతృత్వంలోని బోర్డు తీసుకున్న అనేక నిర్ణయాలు టీటీడీ సంస్థను భక్తుల విస్తృత‌ ప్రయోజనాలకు వేదికగా మార్చారు.

ఉద్యోగుల ప్రయోజనాల కోసం

ఏ సంస్థ గొప్పదనం అయినా అ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంతృప్తి, పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు బ్రహ్మోత్స‌వాలు సందర్భంగా సంస్థ శాశ్వత ఉద్యోగులకు ఇచ్చే బహుమానం హోదాను బట్టి ఉండేది. ఈ విషయంలో హెచ్చుత‌గ్గులు మంచిది కాదని అందరికీ ఒకే రకమైన బహుమానం అమలు చేసే సముచిత నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ సంస్థలో పనిచేసే సిబ్బంది  ఇళ్ల స్థలాలు ఒక క‌ల‌. 

టీటీడీ చైర్మన్‌గా భూమన తీసుకున్న ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంస్థలలో పని చేస్తున్న సిబ్బందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అమలు ప్రారంభ‌మైంది. నేటికి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ప్రక్రియ మొదలై ఈ కార్యక్రమం ఆయ‌న తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా సంపూర్ణం అయ్యే పనీ భూమన నేతృత్వంలోనే జరగబోతోంది.

భక్తుల సౌకర్యాల కల్పన

శ్రీవారి భక్తుల సౌకర్యాలలో దర్శనం తర్వాత ముఖ్యమైనది వసతి, భోజనం. నిత్యాన్నదాన పథకాన్ని విస్తృత పరచడం ద్వారా భక్తులకు భోజన సమస్యకు పరిష్కారం లభించింది. తిరుమలలో రెండు భారీ వసతి గృహాల నిర్మాణం, తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నిర్మించిన విష్ణు నివాసం, అలాగే తిరుమ‌ల‌లో కౌస్తుభం,పాంచ‌జ‌న్యం అతిథి గృహాలు ఈయ‌న కాలంలోనే నిర్మించారు. వీటి వ‌ల్ల‌ శ్రీవారి భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. SVBC నిర్ణయం ద్వారా ప్రపంచంలోని శ్రీవారి భక్తులు శ్రీవారి ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా చూస్తున్నారు.

అన్యమత వివాదానికి ముగింపు ప‌లికేలా  చట్టం

టీటీడీలో నిత్యం  అన్యమత ప్రచారం పేరుతో వివాదాలు జరుగుతుంటాయి. శాశ్వత ముగింపున‌కు చట్టం తీసుకొచ్చారు. టీటీడీ విద్యా వైద్య సంస్థలు కూడా నిర్వహిస్తోంది. విద్యా సంస్థలు ఎయిడెడ్ సంస్థలు కాబట్టి నియామకాలలో అన్ని మతాల వారికి అవకాశం ఉంటుంది. టీటీడీ  యామకాలలో కూడా సాధారణ అర్హత ప్రాతిపదికన జరిగేవి. అందువల్ల హిందూ ధార్మిక సంస్థలో ఇతర మతస్తులకు అవకాశం వచ్చింది.  దీంతో ఒక్కో సారి వివాదాలకు ఆస్కారం ఏర్పడేది. టీటీడీ నియామకాలలో కచ్చితంగా హిందువులే ఉండాల‌న్న నిబంధనలు తీసుకొచ్చింది భూమనే. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల ఎయిడ్‌ సమస్యగా మారింది. ప్రభుత్వం ఇచ్చే ఎయిడ్‌ కూడా వద్దని టీటీడీ నిర్వహించే  సంస్థలో ఉద్యోగం పొందాలంటే హిందువులు మాత్రమే అర్హులు అన్న చట్టం భూమన తీసుకొచ్చి అన్యమత వివాదానికి ముగుంపు ప‌లికారు.

ప్రతిపక్ష, అధికార పార్టీనేతగా భూమనతో నా అనుబంధం 25 సంవత్సరాలు. టీటీడీ చైర్మన్‌గా భూమన నేతృత్వంలోని బోర్డు తీసుకున్న నిర్ణయాల అమలు కోసం 14 సంవత్సరాల తర్వాత కూడా పోరాటాలు చేస్తున్నారు. అంటే వారు తీసుకున్న నిర్ణయాల ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా ఆయ‌న  చైర్మన్‌గా ఉన్నప్పుడు నేను అసంతృప్తి చెందింది… అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మీరు, తిరుపతి సమగ్రాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఎందుకని? ఆయ‌న స‌మాధానం భవిష్యత్‌లో చేద్దాం పోరస్ అనేవారు. మరో సారి చైర్మన్ గా బాధ్యతలు తీసుకోబోతున్న భూమనకు అభినందనలు.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం