‘ముని’వాక్యం: స్నేహం నిలిచేది ఎప్పుడంటే..?!

‘నా భార్యను నేను కొడుతూ ఉంటాను’ అని స్వయంగా చెప్పుకున్న మోహనదాసును ఎందరు అసహ్యించుకున్నారో మనకు తెలియదు. అలాంటి దిక్కుమాలిన పని చేసే వ్యక్తి అయినందుకు ఎందరు ఈసడించుకున్నారో మనకు తెలియదు. ‘సత్యా నా…

‘నా భార్యను నేను కొడుతూ ఉంటాను’ అని స్వయంగా చెప్పుకున్న మోహనదాసును ఎందరు అసహ్యించుకున్నారో మనకు తెలియదు. అలాంటి దిక్కుమాలిన పని చేసే వ్యక్తి అయినందుకు ఎందరు ఈసడించుకున్నారో మనకు తెలియదు. ‘సత్యా నా ప్రయోగో’ పేరుతో ఆయన తొలుత గుజరాతీలో ప్రతివారమూ రాసిన వ్యాసాలు ఎంత త్వరగా యావత్ ప్రపంచానికి తెలిశాయో.. ఆయన తన గురించి తానే చెప్పుకున్న అలవాటు.. ఎప్పటికి ప్రపంచం మొత్తం దృష్టికి వచ్చిందో మనకు తెలియదు. 

అందరూ ఆ విషయం తెలుసుకుని, ఇది మనం అసహ్యించుకోవాల్సిన ‘అలవాటు’ అని గ్రహించేలోగానే ఆయన ‘మహాత్ముడు’ అయిపోయారు! ఒకసారి మహాత్ముడు అయిపోయిన తర్వాత.. లోపాలను కూడా చూసే దృష్టికోణం మారిపోతుంది. ‘ఆయన చెప్పకపోతే ఆ సంగతి మనకు తెలిసేదే కాదు కదా..’ అనే ఆత్మవంచనాత్మకమైన వాదనతో మనం రోజులు గడిపేస్తుంటాం.

‘కానీ, మాంసాహారానికి వాడిన గరిటెనే శాకాహారానికి కూడా వాడుతుంటారేమోనని నాకు భయం. అందుకే బయటకు వెళ్లినప్పుడు శాకాహార హోటళ్లను మాత్రమే ఎంచుకుంటా?’ అని చెప్పినందుకు సుధామూర్తి ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఆమెను సమర్థించేవాళ్లు, తప్పుపట్టేవాళ్లు కులాలను బట్టి, పార్టీలను బట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మహాత్మాగాంధీ కాలం నాటి కమ్యూనికేషన్ యుగం కాదు ఇది. అందుకే సుధామూర్తి మాటలు.. కేవలం కొన్ని గంటల్లోనే యావత్ ప్రపంచానికి తెలిశాయి. దానికి తగ్గట్టుగానే ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయి తమ స్పందనలను వెల్లువెత్తిస్తోంది.

మహాత్మాగాంధీ- సుధామూర్తి, శాకాహారం- మాంసాహారం.. ఈ గొడవలన్నింటినీ పక్కన పెట్టండి. ఈ స్నేహితుల దినోత్సవం రోజున మనం గుర్తించాల్సిన సంగతేంటంటే.. తప్పు- ఒప్పు అనేవి మన దృష్టికోణం మీదనే ఆధారపడి ఉంటాయి. మనలో ప్రతిఒక్కరూ మన వ్యక్తిగత పతన స్థాయులను తూకం రాళ్లుగా వాడుకుంటూ.. ఇతరుల మంచిచెడులను బేరీజు వేయడానికి ప్రయత్నిస్తుంటాం. సాధారణంగా మనం పతనమైనంత వరకు కాలంతో పాటు మారడం అని సరిపెట్టుకుంటూ ఉంటాం… మనకంటె జాస్తిగా పతనమైన వాడిని మాత్రం నిందిస్తుంటాం. 

ఉదాహరణకు ఏ వ్యసనమూ లేని ఒక వ్యక్తి.. సిగరెట్ తాగేవాడిని తప్పుపట్టవచ్చు. సిగరెట్ ప్రియుడు మద్యం తాగేవాడిని తప్పుపడతాడు. అలాగే మద్యపానప్రియుడు వ్యభిచారిని తప్పుపడతాడు.. ఇలా ఈ చైన్ కొనసాగుతూ ఉంటుంది. తమాషా ఏంటంటే.. తప్పు ఒప్పు అనేవి మన దృష్టికోణం మాత్రమే అని మనం గ్రహించం. ఇతరుల్లో ఏదైనా తప్పు అని మనకు అనిపిస్తే గనుక.. వారిని నిందిస్తూ కూర్చోకుండా.. ఆ పని మనం చేయకుండా ఉంటే సరిపోతుందని, మన వ్యక్తిత్వాన్ని అలా మార్చుకుంటే చాలునని ఊరుకోం. అలాంటి అలవాటు ఉంటే సుధామూర్తి వ్యాఖ్యల గురించి ఇంత చర్చ జరిగేదే కాదు.

సుధామూర్తి కేవలం తన అలవాటును మాత్రమే చెప్పారు. దానిని మనం సిద్ధాంతంలాగా చూస్తున్నాం. అందరూ అదే పని చేయాలని ఆమె ప్రవచించడం లేదు. నాన్ వెజ్ తినే వారిని ఆమె అవమానించలేదు. కించపరచలేదు కూడా. ఎదుటివారిని మన expectations కు తగ్గట్టుగా ఉండాలని అనుకోవడం వల్ల వచ్చే అనేకానేక సమస్యల్లో ఇది కూడా ఒకటి.

ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే.. ఏ ఇద్దరి మధ్య మానవ సంబంధాలు చెడిపోతుండడానికైనా కారణం ఇదే. ఎదుటివారి అలవాట్లను, అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకున్నప్పుడు సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క స్నేహితుడిలో  ఒక్కొక్క లోపాన్ని గుర్తిస్తూ.. ఆయా లోపాలను అసహ్యించుకుంటూ.. వారిని దూరం చేసుకుంటూ వెళితే.. ప్రతి మనిషీ ఒకనాటికి ఒంటరిగానే మిగులుతారు. ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురూ ఒక్కతీరుగా ఉండరు. 

ఏ ఇద్దరి వేలిముద్రలు ఒక్క తీరుగా ఉండవని అనుకునే రీతిగానే.. ఏ ఇద్దరి బుద్ధులు కూడా ఒక్కతీరుగా ఉండవు. ఎదుటివారితో మన ప్రవర్తన అనేది సాధారణంగా అవసరాలు- అవకాశాలను బట్టి మారిపోతుంటుంది. అలాగే అవతలి వారి స్థాయిని హోదాను బట్టి కూడా మారిపోతుంటుంది. ఇలాంటి పోకడలను దాటుకుని సమానంగా చూడడం అలవాటు చేసుకుంటే ఎవ్వరికీ ఏ చింతా ఉండదు.

ఇవాళ స్నేహితుల దినోత్సవం. స్నేహం ఎంత గొప్పదో, అమ్మనాన్నల కంటె, బంధువుల కంటె స్నేహితులు ఎంత గొప్పవాళ్లో, తల్లిదండ్రుల్ని సోదరుల్ని భార్యని/భర్తని కూడా స్నేహితుల్లాగా చూడడం ఎంత మంచి పద్ధతో.. మనకు సోషల్ మీడియా యూనివర్సిటీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. 

స్నేహితులను కాపాడుకోవడానికి, స్నేహాలను కాపాడుకోవడానికి మనం ఏం చేస్తుంటాం? ఇది ఖచ్చితంగా ఎదుటివాడిని గౌరవించడం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే పని! అవసరాల పునాదుల మీద నిర్మాణం కానంత వరకు, అవకాశాల ఉధృతిలో పడి ఊపిరాడక మరణించనంత వరకు, స్థాయులు హోదాల శిఖరాలకు అనుగుణంగా చిక్కబడకుండా ఉన్నంత వరకు.. మంచి స్నేహం పదిలంగానే ఉంటుంది. ఆడుకునే వీధి, పాఠశాల, పనిస్థలం, ప్రయాణం.. ఇలా ప్రతిచోటా చేసుకోగలిగితే మనకు స్నేహితులు దొరుకుతుంటారు. కానీ అందరినీ మనం సమానంగా కాపాడుకోలేం. 

మన ఇష్టాలకు లేదా మన వ్యసనాలకు దగ్గరగా ఉండేవారితోనే బంధాన్ని జాస్తిగా పెనవేసుకుంటూ పోతుంటాం. అందుకే విశాల ప్రపంచంలో స్నేహబంధాలు పరిమితంగానే ఉంటుంటాయి. మనలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా స్నేహితులు కూడా వడపోతకు గురవుతూ ఉంటారు. ఒకసారి స్నేహం కుదిరిన తర్వాత.. అవతలి వాడు మన ఇష్టాలకు తగ్గట్టుగా ఉండకపోయినా సరే, మనకు నచ్చని అలవాట్లతో ఉన్నా వాటిని విస్మరించి బంధాల్ని కొనసాగించండి.

‘సర్వత్ర సమబుద్ధయః’ అంటాడు గీతలో భగవానుడు. అన్ని ప్రాణులను ఒకే తీరుగా చూడమని చెప్పడం మాత్రమే ఈ గీతా వాక్యంలో పరమార్థం కాదు. సమాజంలో అందరు మనుషుల్లో.. అన్ని రకాల బుద్ధులను కూడా సమానంగా చూడమని చెప్పడమే లక్ష్యం! ఆ తత్వం మనం అలవాటు చేసుకోవాలి. 

మహాత్మాగాంధీని మనం గౌరవించడం నేర్చుకున్నాం. ఆయన తనలోని లోపాలను చెప్పుకున్నా కూడా.. వాటిని మనం విస్మరించాం. ఆయనను మనం జాతిపితగానే ఆరాధిస్తున్నాం. ఏ వ్యక్తిని పరిగణనలోకి తీసుకున్నా.. ఎన్నదగిన మంచిని గ్రహించడం వరకు మాత్రమే పరిమితం కావాలనే అత్యద్భుతమైన సత్యానికి గాంధీ జీవితం పట్ల మనకున్న గౌరవమే ఉదాహరణ. వ్యక్తుల అలవాట్లు ఎప్పుడూ కూడా సిద్ధాంతాలు కావు. వారి అలవాట్లు వారు చెప్పుకుంటే తప్ప మనకు తెలియవు. సెలబ్రిటీలు అయినంత మాత్రాన.. వారి అలవాట్లను సిద్ధాంతా రాద్ధాంతాల చర్చల్లోకి లాగడం సబబు కాదు. ఈ విచక్షణ మనలో ఉంటే.. సోషల్ మీడియాలో వెల్లువెత్తే వాదప్రతివాదాల ప్రవాహాలకు అడ్డుకట్టపడుతుంది. సమరసవాతావరణం ఏర్పడుతుంది.

ఇదే లక్షణాన్ని మనం స్నేహితులకు కూడా ఆపాదించి చూసుకుందాం. ఏ ఒక్కరూ మనకు అయిష్టంగా కనిపించరు. ఏ ఒక్కరి పట్ల మనకు శత్రుభావం పుట్టదు. అలాంటి ప్రపంచం చాలా హాయిగా ఉంటుంది. 

స్నేహితులను
కలుస్తూ ఉండండి!
కనీసం, పలకరిస్తూ ఉండండి!
విభేదించండి, తగాదా పడండి..
దూషించుకోండి, కొట్లాడుకోండి..
కానీ అన్నీ మరచి
కలుస్తూ, పలకరిస్తూ బతకండి!
ఆర్థిక వయో తారతమ్యాలను ఎంచకుండా..
మనలో ప్రతి ఒక్కరికీ అందే కానుక ఒకటుంటుంది!
అది దక్కిన భాగ్యశీలి ముక్తుడు!
దక్కని ప్రతి ఒక్కడూ రుణగ్రస్తుడు!

మనం రుణగ్రస్తులుగా మిగిలేక..
అయ్యో నిన్ను కలవలేదే..
పలకరించి బహుకాలం గడచిందే..
అని 
దక్కించుకున్న భాగ్యశీలుర గురించి
ఆక్రోశించే స్థితి రానివ్వకండి!

స్నేహాలు చాలా మధురమైనవి..
వాటిని ఆస్వాదిస్తూ అనుక్షణం జీవించండి!

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]