వైజాగ్ లో వైసీపీ పాగా !

జాగా దొరకాలే కానీ పాగా వేయడం రాజకీయ లక్షణం. ఇక జాగా తామే చేసుకుని దూరిపోవడం ఆప‌ర చాణక్య నీతి. ఇపుడు వైసీపీ అదే చూపిస్తోంది. దూకుడుగా ముందుకు సాగుతోంది. పాలనా రాజధానిగా విశాఖను…

జాగా దొరకాలే కానీ పాగా వేయడం రాజకీయ లక్షణం. ఇక జాగా తామే చేసుకుని దూరిపోవడం ఆప‌ర చాణక్య నీతి. ఇపుడు వైసీపీ అదే చూపిస్తోంది. దూకుడుగా ముందుకు సాగుతోంది. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపధ్యంలో విశాఖ మేయర్ సీటుని వైసీపీ ప్రతిష్టగా తీసుకుంది.

ఒక్క దెబ్బతో అందరి నోళ్ళూ మూయించాలన్న ఉద్దేశ్యంతో వేగంగా పావులు కదుపుతోంది. వైసీపీ జోరుకు ప్రతిపక్ష టీడీపీ ఇరకాటంలో పడుతోంది. పేరుకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బలమైన పార్టీగా సిటీలో కనిపిస్తున్నా వైసీపీ చేపడుతున్న అండర్ గ్రౌండ్ ఆపరేషన్ తో పచ్చ పార్టీ పరేషాన్ అవుతోంది.

మాజీలను, తాజాలను కుడి ఎడమలు చూడకుండా వైసీపీ ఒక్కసారిగా  చేర్చేసుకుంటూండడంతో టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. మాజీ మంత్రి, సీనియర్ నేతగా ఉన్న పసుపులేటి బాలరాజుని, ఆయన కుమార్తె  డాక్టర్ దర్శినిని  కూడా వైసీపీ గూటికి చేర్చుకుంది. దాంతో అటు సిటీలో ఇటు ఏజెన్సీలో కూడా ఒక్కసారిగా బలం పెరిగింది.

అదే విధంగా జనసేనలో ఉన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే, పట్టున్న నేత, బలమైన సామాజికవర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్యను కూడా వైసీపీ నీడకు తెచ్చేశారు. దాంతో జనసేనకు చివరి ఆశలు కూడా లేకుండా పోయాయి. మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉత్తరంలో అండంగా ఉంటూ ఆయన గెలుపునకు సహకరించిన మాజీ తైనాల విజయకుమార్ కి కూడా వైసీపీ కండువా కప్పేసింది.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ నాయకుడు ఎస్ ఎ రహమాన్ వైసీపీలో చేరిపోయారు. ఈ మొత్తం తతంగం అంతా ఒక వ్యూహం ప్రకారం సాగుతోంది. విశాఖ మేయర్ ఏపీలోనే అతి పెద్దది, అధికార పార్టీకి చాలా  కీలకమైనది, విశాఖ  రాజధాని నగరానికి కిరీటంలాంటిది. అందువల్ల అధిక వార్డులను గెలుచుకుని మేయర్ కుర్చీలో పాగా వేయాలని వైసీపీ వేస్తున్న ఎత్తులకు విపక్షమైన పచ్చ పార్టీ  చిత్తు అవుతోంది.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?