దర్శకులు కేవలం డైరక్షన్ మాత్రమే చేయరు. సమయం, సందర్భం కుదరాలే కానీ నేరుగా నిర్మాతల అవతారం ఎత్తుతారు. అది కూడా కుదరని పక్షంలో మరో సినిమాకు సమర్పకుడిగా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా మారిపోతారు. డైరక్టర్లకు ఓ రకంగా ఇది సైడ్ బిజినెస్ లాంటిది.
ఈ బిజినెస్ లో చేతినిండా లాభాలు అందుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్. మరోవైపు ఇదే తరహా బిజినెస్ లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా లాస్ అయ్యాడు మారుతి. ఇప్పుడు అనీల్ రావిపూడి వంతు వచ్చింది. మరి ఈ దర్శకుడు సుకుమార్ బ్యాచ్ లో చేరుతాడా లేక మరో మారుతి అవుతాడా?
ముందుగా మారుతి విషయానికొద్దాం.. ఈ దర్శకుడు కెరీర్ లో మంచి సక్సెస్ లో ఉన్నప్పుడే ప్రజెంటర్ గా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా అవతారం ఎత్తాడు. దీంతో పాటు ఎన్నో సినిమాలకు రచయితగా, సహ-నిర్మాతగా కూడా మారుతి కార్డు పడింది. వీటిలో 'ప్రేమకథాచిత్రమ్' లాంటి సినిమాను మినహాయిస్తే.. మరే సినిమాతో మారుతి పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయాడు.
మరీ ముఖ్యంగా లండన్ బాబులు, బ్రాండ్ బాబు, రోజులు మారాయ్ లాంటి సినిమాలు మారుతి ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి. దీంతో ఇకపై తను పక్కచూపులు చూడనని, పూర్తిగా దర్శకత్వంపైనే దృష్టి పెడతానని, మారుతి తనకుతానుగా ప్రకటించుకోవాల్సి వచ్చింది.
ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఇలాంటి విషయాల్లో సుకుమార్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ను స్థాపించి ఎంతవరకు కలుగజేసుకోవాలో అంతవరకే తన పాత్రను పరిమితం చేస్తున్నాడు.
కుమారి-21ఎఫ్ తో నిర్మాతగా మారిన సుక్కూ, మినిమం గ్యాప్స్ లో సినిమాలు నిర్మిస్తూనే, వాటికి కథ-స్క్రీన్ ప్లే సహకారాలు అందిస్తున్నాడు. మరీ ముఖ్యంగా మంచి కాంబినేషన్లు సెట్ చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఉప్పెనతో ఏకంగా 18 కోట్ల రూపాయల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చేతిలో మరో 3 ప్రాజెక్టులున్నాయి.
ఇప్పుడు అనీల్ రావిపూడి విషయానికొద్దాం. దర్శకుడిగా మారిన తర్వాత తొలిసారి వేరే సినిమాకు వర్క్ చేశాడు అనీల్ రావిపూడి. తన దగ్గర పనిచేసిన కృష్ణ అనే వ్యక్తిని సపోర్ట్ చేసేందుకు గాలిసంపత్ ప్రాజెక్టులోకి ఎంటరయ్యాడు. ముందుగా స్క్రీన్ ప్లే-ప్రజెంటర్ కార్డు వేశారు. కొన్ని రోజుల తర్వాత సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావడం కోసం దర్శకత్వ పర్యవేక్షణ అనే పెద్ద కార్డు కూడా వేసేశారు.
ఇలా అనీల్ రావిపూడిని పూర్తిస్థాయిలో వాడుకున్నప్పటికీ గాలిసంపత్ తేలిపోయింది. “అనీల్ కార్డు” ఈ సినిమాకు బొత్తిగా కలిసిరాలేదనే విషయం ఓపెనింగ్స్ తోనే తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో.. అనీల్ భవిష్యత్తులో కూడా ఇలాంటి ''సైడ్ బిజినెస్'' పనులు చేస్తాడా లేక పూర్తిస్థాయిలో డైరక్షన్ పైనే దృష్టిపెడతాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది.