ఆ మధ్య ఒక రాష్ట్ర స్థాయి నేత రాహుల్ గాంధీని కలవడానికి ఎన్నో పాట్లు పడ్డాడట. చివరకు రాహుల్ తో కాసేపు అపాయింట్ మెంట్ దక్కగా, వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లాకా.. రాహుల్ ఆయనతో ఒకవైపు మాట్లాడుతూ, మరోవైపు కుక్కతో ఆడుకోసాగాడట. రాహుల్ దగ్గర ఒక జాతి కుక్క ఏదో ఉంది. దానికి ఫీడింగ్ చేస్తూ, దానిపై మురిపాలు ఒలకపోస్తూ.. సదరు కాంగ్రెస్ నేతతో మాట్లాడట రాహుల్! ఆ తీరుతో విసిగెత్తిపోయి, సదరు నేత బయటకు రాగానే కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలోకి చేరిపోయాడు, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పుట్టి అంతటితో మునిగింది!
రెండు మూడేళ్ల కిందట ఆ విషయం జాతీయ స్థాయిలో మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది. కట్ చేస్తే.. జ్యోతిరాదిత్య సింధియా గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీతో సమావేశం కోసం ప్రయత్నించారని, అయితే ఆయనకు రాహుల్ అపాయింట్ మెంట్ దక్కలేదని, సింధియా అనుచరుడొకరు ఇప్పుడు మీడియాకు చెబుతున్నారు!
సింధియా అంటే.. ఆయన రాహుల్ కు రైట్ హ్యాండ్ అనే అభిప్రాయాలున్నాయి. ఏదో సోనియా ఒత్తిడి వల్ల మాత్రమే సింధియాకు మధ్యప్రదేశ్ సీఎం పీఠం దక్కలేదు, రాహుల్ మాత్రం యువ నాయకత్వాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు, సింధియా-పైలట్ లాంటి వాళ్లు రాహల్ కు లెఫ్టూ, రైటు అనే విశ్లేషణ వినిపిస్తూ ఉంటుంది.
అయితే రాహుల్ కు ఆ పాటి తీరిక కూడా లేదని, రాహుల్ తో సమావేశం కోసం సింధియా నెలల పాటు వేచి చూడాల్సి వచ్చిందని, చివరకు రాహుల్ కు సింధియాతో సమావేశం అయ్యే తీరిక లేకపోయిందంటే… కాంగ్రెస్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి సోనియా, రాహుల్ ల నాయకత్వంలోనా.. బీజేపీని కాంగ్రెస్ ఓడించేది?