రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి విష‌యంలో బీజేపీ మార్కు స‌స్పెన్స్!

భార‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో అభ్య‌ర్థిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ బోలెడంత స‌స్పెన్స్ ను మెయింటెయిన్ చేస్తూ ఉంది. ఈ స‌స్పెన్స్ అనంత‌రం బీజేపీ ఒక స‌ర్ ప్రైజ్ ప్ర‌క‌ట‌న‌తో కొత్త రాష్ట్ర‌ప‌తిని రాష్ట్ర‌ప‌తి…

భార‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో అభ్య‌ర్థిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ బోలెడంత స‌స్పెన్స్ ను మెయింటెయిన్ చేస్తూ ఉంది. ఈ స‌స్పెన్స్ అనంత‌రం బీజేపీ ఒక స‌ర్ ప్రైజ్ ప్ర‌క‌ట‌న‌తో కొత్త రాష్ట్ర‌ప‌తిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కు పంపే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఇలాంటి స‌స్పెన్స్ క‌మ‌లం పార్టీకి కొత్త కాదు!

గ‌త ప‌ర్యాయం రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తూ కూడా బీజేపీ చాలా మందిని ఆశ్చ‌ర్య ప‌రిచింది. మ‌రీ క‌మ‌లం పార్టీ రాజ‌కీయాల‌ను చాలా క్లోజ్ గా ఫాలో అయ్యే వారికి త‌ప్ప సౌతిండియాలో రామ్ నాథ్ కోవింద్ గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు! 

బీజేపీకి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని గెలిపించుకునే అవ‌కాశాలున్నాయ‌నేది అప్ప‌టికే అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ.. కోవింద్ అభ్య‌ర్థిత్వం మాత్రం స‌ర్ ప్రైజే!

బ‌హుశా అలాంటి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌, ఊహ‌కు అంద‌ని అభ్య‌ర్థిత్వ ప్ర‌క‌ట‌నే ఈ సారి కూడా బీజేపీ వైపు నుంచి ఉండ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలు ఏర్ప‌డుతున్నాయి. అయితే ఇప్ప‌టికే ప‌లు పేర్లు చ‌ర్చ‌లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల‌కు కేంద్రంలోని మోడీ స‌ర్కారు నియ‌మించిన ప‌లువురు గ‌వ‌ర్న‌ర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 

ఈ జాబితాలో త‌మిళిసై తో మొద‌లుపెడితే ద్రౌప‌ది ముర్మూ వ‌ర‌కూ గ‌వ‌ర్న‌ర్ల పేర్లున్నాయి. వీరిలో సౌతిండియా కోటా, ఎస్టీ కోటా, ముస్లిం.. ఇలాంటి రిజ‌ర్వేష‌న్లే విశ్లేష‌ణ‌ల‌కు అందుతున్నాయి. 

ఈ సారి సౌత్ వ్య‌క్తికి రాష్ట్ర‌ప‌తిగా అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటే త‌మిళి సై కు అవకాశం ద‌క్క‌వ‌చ్చ‌ని, ముస్లింకు ఇవ్వాల‌నుకుంటే కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ కు, ఎస్టీకి అనుకుంటే ముర్మూకూ అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌నే విశ్లేష‌ణ‌లున్నాయి. ఇక ద‌శాబ్దాలుగా బీజేపీ మైనారిటీ విభాగం అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న ముక్తార్ అబ్బాస్ న‌క్వీ పేరు కూడా వినిపిస్తోంది.

అయితే ఇలాంటి పేర్లు వినిపించ‌డంలో వింత లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాలకే బీజేపీ ఈ విష‌యంలో ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌నుంద‌నే స్ప‌ష్టం అవుతుండ‌టం వ‌ల్ల వినిపిస్తున్న పేర్లు మాత్ర‌మే ఇవి! 

ఇవే వ‌ర్గాల నుంచి ఊహించ‌ని పేరును ఆఖ‌రి నిమిషంలో బీజేపీ ప్ర‌క‌టించే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. కోవింద్ ను ఎంపిక చేసిన త‌ర‌హాలో.. ఈ సారి కూడా ఎంపిక ఉండ‌వ‌చ్చు కూడా!