టీడీపీ పతనానికి చంద్రబాబు తప్ప మరెవరూ కారణం కాదనేది వాస్తవం. ఇంత కాలం కార్పొరేట్ శక్తులకు, పార్టీ జెండా మోయని వాళ్లకు, నీతినిజాయతీ లేని వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కట్టబెట్టిన వైనం బాబు మాటల్లో బయటపడింది. పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లకు కాకుండా ఇతరులకు పదవులు, అధికారం కట్టబెట్టాననే పశ్చాత్తాపం చంద్రబాబులో కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు వెంట ఉన్న వాళ్లెవరకూ, ప్రతిపక్షంలో లేకపోవడం చంద్రబాబులో ఆలోచన కలిగిస్తోంది. ఇంత కాలం టీడీపీలో ప్రాధాన్యం ఎవరెవరికి ఉండేదో చంద్రబాబు తనకు తానుగా బయట పెట్టారు.
అనకాపల్లిలో టీడీపీ కొత్త కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్స్ టీడీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యం ఇస్తాం. అంకిత భావం, నీతినిజాయతీతో మెలిగే వారికే ఈ సారి పదవుల్లో అవకాశం కల్పిస్తాం” అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
ఈ మాటలు చాలవా… ఇంతకాలం చంద్రబాబు ఎవరికి ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోడానికి? ఈ మాటలు చాలవా….చంద్రబాబు పశ్చాత్తాపం పడుతున్నారని అర్థం చేసుకోడానికి! పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యం ఇవ్వలేదని, అలాగే నీతినిజాయతీతో మెలగని వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చానని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకు న్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన మాటలకు అర్థాలు అవి కాకపోతే, “ఈ సారి” అని ప్రత్యేకంగా నొక్కి చెప్పాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తదితర పారిశ్రామిక, లిక్కర్ వ్యాపారులకు ఒకటికి రెండుసార్లు రాజ్యసభ టికెట్లు చంద్రబాబు ఇచ్చారు. అలాగే విద్యా వ్యాపారి నారాయణకు ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి పదవి కట్టబెట్టి గౌరవించారు. ఇప్పుడు టీడీపీ కష్టకాలంలో వాళ్లంతా ఎక్కడున్నారు? ఏమయ్యారు? అనే ప్రశ్నలు పార్టీ నాయకులు, శ్రేణుల నుంచి వస్తున్నాయి. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చిన వాళ్లు, అవి నెరవేరవని అర్థమైనప్పుడు విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వారందరికీ చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇవాళ టీడీపీకి ఈ దుస్థితి వచ్చిందనే వాళ్లే ఎక్కువ. పార్టీ పతన దశలో చంద్రబాబుకు జ్ఞానోదయం అయినట్టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇకపై పార్టీ జెండా మోసిన, నీతినిజాయతీ ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు నమ్మబలుకుతున్నారని అంటున్నారు.
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే వాళ్లను విడిచిపెట్టి, ఎన్నికల సమయానికి డబ్బున్న వాళ్లను తీసుకొచ్చి నెత్తిన రుద్దుతారనే అనుమానం, ఆగ్రహం టీడీపీ శ్రేణుల్లో బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడే వాళ్లు కరువవుతారనే ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోంది. అదే ఆయన్ను నిద్రలేపినట్టు సొంత పార్టీ వాళ్లు చెబుతున్నారు.
సొదుం రమణ