మంత్రి రోజాపై ఇటీవల నోరు జారారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. సినీ గ్లామర్ తో వైసీపీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవాలని చూస్తోందని, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విజయం వారిదే అనుకుంటే.. పది మంది మంత్రులెందుకంటూ విమర్శలు చేశారు.
కట్ చేస్తే ఇప్పుడు అదే సినీ గ్లామర్ కోసం బీజేపీ కూడా వెంపర్లాడుతున్నట్టుంది. లేకపోతే జయప్రదను అంత హడావిడిగా ఆత్మకూరుకి ఎందుకు పిలిపిస్తారు చెప్పండి. ఈనెల 19న జయప్రద ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం మొదలు పెట్టబోతున్నారు.
ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. మరో వారం రోజుల్లోపే ఆత్మకూరు ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దీంతో వైసీపీ, బీజేపీ పోటా పోటీగా ప్రచారం చేపడుతున్నాయి. వైసీపీ ఆల్రడీ మంత్రులను రంగంలోకి దించింది. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి, మరో ఎమ్మెల్యే ఇన్ చార్జిగా ఉన్నారు. వారు తమ పని మొదలు పెట్టారు. ఇక బీజేపీ ఇప్పటి వరకూ స్థానిక నాయకులు, సోము వీర్రాజుపైనే ఆధారపడింది. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ ని రంగంలోకి దింపుతోంది అధిష్టానం.
సీఎం రమేష్, సుజనా చౌదరి, పురంద్రీశ్వరి, సత్యకుమార్, జయప్రద.. ఇలా దాదాపు 10మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ తయారు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ.. లాంటి వాళ్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక వీరిలో స్టార్ అట్రాక్షన్ జయప్రద. ఈమధ్య తెలుగు రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు జయప్రద. మొన్నామధ్య జేపీ నడ్డా పర్యటనలో ఆమె తళుక్కున మెరిశారు. తన పుట్టినిళ్లు ఏపీనే అన్నారు. రాజమండ్రి తన సొంత ప్రాంతమని అభిమానం చూపించారు. ఇప్పుడు ఆమెను ఆత్మకూరుకి తీసుకొస్తున్నారు బీజేపీ నాయకులు.
రోజాని సినిమా నటి అంటూ కామెంట్ చేసిన వీర్రాజు.. ఇప్పుడు జయప్రదతో కలసి ప్రచారంలో పాల్గొంటారా లేదా..? సినిమా వాళ్లంటే అంత చిన్నచూపు అయితే.. మరి జయప్రదను ఎందుకు తెస్తున్నట్టు. మంత్రి హోదాలో రోజా ప్రచారంలో పాల్గొంటే బీజేపీకి అంత భయం ఏంటి..? కమలం రెక్కలన్నీ ఉడగొట్టే రోజు దగ్గర్లోనే ఉందని ఆల్రడీ రోజా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికల్లో ఆ ముచ్చట తీరిపోతుంది.